close

Published : 26/02/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్రోపై పన్నులు క్రమేణ తగ్గించాలి

కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

ముంబయి: పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. పన్నులు క్రమేణ తగ్గిస్తూ పోవడం ముఖ్యమని వివరించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రస్తుతం ఆదాయ ఒత్తిడి అధికంగా ఉందని.. కరోనా ప్రభావం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి అవి ఎక్కువ వ్యయాలు చేయాల్సి వస్తోందని వివరించారు. ‘ప్రభుత్వానికి ఆదాయం తప్పనిసరి. అయితే ద్రవ్యోల్బణం కూడా పట్టించుకోవాల్సిన అంశమే. పెట్రోలు, డీజిల్‌ అధిక ధరల వల్ల తయారీ, రవాణాపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంద’ని గురువారమిక్కడ బాంబే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు.
డిజిటల్‌ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు
డిజిటల్‌ కరెన్సీపై మాట్లాడుతూ ‘ఆర్‌బీఐలో అంతర్గతంగా ఈ విషయమై చాలా పనులు జరుగుతున్నాయి. కొన్ని మార్గదర్శకాలు, పత్రాలను త్వరలోనే విడుదల చేస్తామ’ని అన్నారు. క్రిప్టోకరెన్సీలపై కొన్ని ఆందోళనలున్నాయని.. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
బలమైన మొండి బ్యాంకుకు అవకాశముంది: మరో వైపు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ)లను బలోపేతం చేసే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తోందనీ చెప్పారు. బడ్జెట్‌ 2021లో ప్రతిపాదించిన మొండి బ్యాంకుపై మాట్లాడుతూ ‘ప్రస్తుత ఏఆర్‌సీల కార్యకలాపాలను అది ఏ విధంగానూ స్తబ్దుగా చేయదు. దేశంలో మరో బలమైన ఏఆర్‌సీ(మొండి బ్యాంకు)కి అవకాశం ఉందని నేను భావిస్తున్నాన’ని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 28 ఏఆర్‌సీలున్నాయి. ప్రతిపాదిత ఏఆర్‌సీ ప్రభుత్వ రంగ బ్యాంకు పుస్తకాల నుంచి ఒత్తిడిలో ఉన్న ఆస్తులను తీసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
రుణ మంజూరులో జాగ్రత్త
‘మొండి బకాయిదార్లతో ఎలా వ్యవహరించాలన్న విషయంపై బ్యాంకుల్లో అవగాహన పెరుగుతోంది.. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల కోసం బ్యాంకులు చురుగ్గా కేటాయింపులు చేస్తున్నాయ’ని దాస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ రుణ మంజూరు ప్రక్రియలను సైతం మెరుగు పరచుకోవాలని..రుణ ఎగవేతలకు పాల్పడే వారికి మళ్లీ రుణాలు ఇవ్వకుండా ఉండాలని సూచించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని