నష్టాల ఉప్పెన
1939 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
2020 మే తర్వాత ఒకరోజు అత్యధిక భారీ పతనం
నిఫ్టీ 568 పాయింట్లు కుదేలు
సగటున నిమిషానికి రూ.1,450 కోట్లు పోయే
సమీక్ష
రూ.5.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనంతో బీఎస్ఈలో మదుపర్ల సంపద రూ.5.3 లక్షల కోట్ల మేర ఆవిరైంది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5,37,375.94 కోట్లు తగ్గి రూ.2,00,81,095.73 కోట్లకు పరిమితమైంది.
స్టాక్‌మార్కెట్‌పై బేర్ మళ్లీ ప్రతాపం చూపింది. బడ్జెట్ తరవాత జీవితకాల గరిష్ఠాలను తాకి, ఆ సమీపంలోనే కదలాడుతున్న సెన్సెక్స్, గత 10 నెలల్లోనే ఒకరోజు అత్యంత భారీ పతనాన్ని శుక్రవారం (1939 పాయింట్లు) చవిచూసింది. అమెరికాలో బాండ్ల రాబడులు ఒక్కసారిగా పెరగడంతో విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే ఆందోళనలు, అమెరికా- సిరియాల మధ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనుండటంతో మదుపర్లు ముందు జాగ్రత్తతో అమ్మకాలకు దిగారు. నిఫ్టీ కీలకమైన 15,000 స్థాయిని కోల్పోగా.. నిమిషానికి సగటున రూ.1,450 కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరయ్యింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం 104 పైసల మేర క్షీణించి 73.47 వద్ద స్థిరపడింది.
నష్టకష్టాలతో
ఉదయం సెన్సెక్స్ 50,256.71 పాయింట్ల వద్ద నష్టాలతోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొకదశలో 48,894.08 పాయింట్ల కనిష్ఠస్థాయికి దిగివచ్చింది. చివరకు 1939.32 పాయింట్ల నష్టంతో 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది. 2020 మే 4 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీగా నష్టపోవడం ఇదే. నిఫ్టీ కూడా 568.20 పాయింట్లు కోల్పోయి 14,529.15 వద్ద స్థిరపడింది.
షేర్లన్నీ ఎరుపు రంగులోనే
సెన్సెక్స్ 30లో అన్ని షేర్లు ఎరుపెక్కాయి. ఓఎన్జీసీ 6.6%, మహీంద్రా అండ్ మహీంద్రా 6.35%, యాక్సిస్ బ్యాంక్ 5.98%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 5.96%, బజాజ్ ఫిన్సర్వ్ 5.95%, పవర్‌గ్రిడ్ 5.69%, హెచ్డీఎఫ్సీ 5.4% మేర నష్టపోయాయి.
ప్రపంచ మార్కెట్లు డీలా..
ప్రపంచ మార్కెట్లలో చైనా షాంఘై 2.1%, జపాన్ నిక్కీ 3.99%, హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 3.64%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 0.82%, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.8% మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
అదరగొట్టిన రైల్‌టెల్: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు నమోదైన తొలి రోజే అదరగొట్టాయి. బీఎస్ఈలో ఈ సంస్థ షేరు ఇష్యూ ధరైన రూ.94కు 11శాతం అధికంగా రూ.104.60 వద్ద నమోదైంది. ఒకానొక దశలో రూ.125.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 16.06 శాతం లాభంతో రూ.121.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో రూ.109 వద్ద నమోదైన షేరు చివరకు 10.64 శాతం పెరిగి రూ.120.6 వద్ద స్థిరపడింది.
కుప్పకూలింది.. ఇందుకే..
బడ్జెట్ అనంతరం దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్లలో, గత 10 నెలల్లోనే ఒకరోజు భారీ పతనం ఎందుకు సంభవించిందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దానికి కొన్ని కారణాలు ఇలా కనిపిస్తున్నాయి.
* అమెరికాలో బాండ్లపై వడ్డీ రేట్లు (బాండ్ ఈల్డ్స్ అని అంటారు) పెరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా నిధులు సమీకరించేందుకు బాండ్లు జారీ చేస్తుంది. ఆ బాండ్లపై వడ్డీరేట్లు ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి స్టాక్‌మార్కెట్ పెట్టుబడులకు అనుకూలం కాదు. బాండ్లపై వడ్డీరేట్లు పెరిగితే, స్టాక్‌మార్కెట్ మదుపర్లు షేర్లకు బదులు బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ఈ భయంతో గురువారం అమెరికా స్టాక్‌మార్కెట్లు బాగా పడిపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 560 పాయింట్లు పడిపోయింది. ఆ మార్కెట్లను అనుసంధానించి సాగే మన స్టాక్‌మార్కెట్లలో శుక్రవారం మరింత భారీ పతనం నమోదైంది.
* పదేళ్ల కాలవ్యవధి కల అమెరికా బాండ్లపై వడ్డీరేట్లను స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. కొవిడ్-19 ముప్పు తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడితే, ప్రజలు మళ్లీ ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం మొదలవుతుంది. దీనివల్ల వస్తు- సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో సరఫరాలు పెరగకపోవచ్చు. దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ ముప్పు ఇప్పుడు కనిపిస్తున్నందున వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.
* స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు ఎంతో ముందు చూపుతో ఉంటారు. అయిదారు నెలలు, ఏడాది తర్వాత జరిగే పరిణామాలకు అనుగుణంగా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీరేట్లు పెరుగుతుంటే, షేర్లు విక్రయించి ఆ సొమ్మును అధిక వడ్డీరేటు లభించే బాండ్లపై పెట్టేందుకు ఆసక్తి చూపటం సహజం.
* అమెరికా ప్రభుత్వ బాండ్లు ఎంతో భద్రమైనవిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భావిస్తారు. అందుకే బాండ్లపై అధిక వడ్డీరేటు వస్తుంటే, వివిధ దేశాల్లోని స్టాక్‌మార్కెట్లలోని తమ పెట్టుబడులు విక్రయించి, ఆ సొమ్ము అమెరికా బాండ్లకు మళ్లిస్తారు. ఈ వరసలోనే విదేశీ సంస్థాగత మదుపరులు మన స్టాక్మార్కెట్లో షేర్లు విక్రయించి ఆ సొమ్మును అమెరికా తీసుకువెళ్లడానికి అవకాశం ఉంది.
* వడ్డీ రేట్లు అమెరికాలో పెరుగుతుంటే, మిగతా దేశాల్లోనూ పెరుగుతాయి. మనదేశంలో 10 ఏళ్ల కాలవ్యవధి గల కేంద్ర ప్రభుత్వ బాండ్లపై వడ్డీరేటు రెండు మూడు రోజుల్లోనే 6.23 శాతానికి పెరిగింది. అంతకు ముందు రోజుతో పోల్చితే ఇది 20 బేసిస్ పాయింట్లు అధికం.
* అందరు ఇన్వెస్టర్లూ ఒకే రకంగా ఆలోచించరు. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అందరూ షేర్లు విక్రయిస్తున్నారని, అందువల్ల స్టాక్‌మార్కెట్లు పడిపోతున్నాయని అనుకోడానికి లేదు. కొందరు అమ్మడం మొదలుపెడితే దాని ప్రభావం ఇతర ఇన్వెస్టర్ల మీద కూడా పడి, వారు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా షేర్లు విక్రయించాల్సి వస్తుంది. ‘లెవరేజ్ పొజిషన్ల’ తగ్గించాల్సి రావటం, ‘మార్జిన్లు ట్రిగ్గర్’ కావటం... వంటి సమస్యలు స్టాక్మార్కెట్లో ఉంటాయి. దీనివల్ల కొంతమంది భారీగా షేర్లు విక్రయిస్తే, దాని ప్రభావంతో మిగిలిన ఇన్వెస్టర్లు కూడా ఎంతో కొంత మేరకు షేర్లు అమ్ముతారు. ఇవన్నీ కలిస్తే... స్టాక్మార్కెట్లో సూచీల్లో భారీ పతనం నమోదవుతుంది. శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఇదే జరిగింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
-
Q. హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
-
Q. నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.