close

Updated : 04/03/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవాగ్జిన్‌ టీకా ప్రభావశీలత 81%

మూడో దశ పరీక్షల్లో నిర్థారణ
ఈనాడు - హైదరాబాద్‌

భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకా 81 శాతం ప్రభావశీలత కనబరచింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం నిర్థారణ అయినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటన్నేషనల్‌ బుధవారం వెల్లడించింది. ‘కొవిడ్‌-19 వ్యాధిని నిరోధించడంలో కొవాగ్జిన్‌ టీకా 81 శాతం ప్రభావశీలత ప్రదర్శించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో మనదేశంలో నిర్వహించిన అతిపెద్ద  క్లినికల్‌ పరీక్ష ఇది’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. ‘మనదేశంలో శాస్త్ర విజ్ఞానానికి, కరోనా వైరస్‌పై పోరాటానికి ఇది పెద్ద మైలురాయి’ అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. కొవాగ్జిన్‌ టీకాపై మూడు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో 27,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారని, కొవిడ్‌-19 వ్యాధి సోకకుండా కాపాడటంలో ఎంత సామర్థ్యం ఈ టీకాకు ఉందో ఈ పరీక్షల్లో తేలిందని వివరించారు. క్లినికల్‌ పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లకు, నిర్వహించిన నిపుణులు, భారత్‌ బయోటెక్‌ సిబ్బందికి  సంస్థ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల కృతజ్ఞతలు తెలిపారు. అందరి భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైనట్లు వివరించారు.

మూడో దశ పరీక్షల విశేషాలు

దేశవ్యాపంగా 21 కేంద్రాల్లో నిర్వహించిన కొవాగ్జిన్‌ టీకా మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో  18-98 ఏళ్ల వయస్కులు 25,800 మంది పాలుపంచుకున్నారు. ఇందులో 60 ఏళ్లు పైబడిన, ఇప్పటికే వ్యాధుల జాడలు ఉన్న 2,433 మంది ఉన్నారు.
మూడో దశ క్లినికల్‌ పరీక్షల మొదటి మధ్యంతర విశ్లేషణ కోసం 43 కేసులు పరిశీలించారు. తద్వారా దీనికి 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు.
ఈ టీకా వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ నామమాత్రమని తేలింది.
యూకే రకం కరోనా వైరస్‌ మీద కూడా కొవాగ్జిన్‌ టీకా బాగా పనిచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అధ్యయనంలో వెల్లడైంది.

నిల్వ, రవాణా ఎంతో సులువు

కొవాగ్జిన్‌ టీకాను 2 - 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో నిల్వ చేయొచ్చు. ద్రవ రూపంలో ఉండే ఈ టీకాను రవాణా చేయడం, ఇంజెక్షన్‌ ద్వారా ఇవ్వడం కూడా సులువే. వయల్‌ను తెరిచినా 28 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అందువల్ల టీకా వృథా కావడం అనేది 10 నుంచి 20 శాతం లోపే ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వివరించింది. ఎన్నో ఏళ్లుగా నిర్థారణ అయిన, విశ్వసనీయ ‘వీరో సెల్‌ ప్లాట్‌ఫామ్‌’ మీద ఈ టీకాను తయారు చేసినందున భద్రతా పరంగా ఇతర రకాల టీకాల కంటే మెరుగైనదని కంపెనీ పేర్కొంది. టీకాలో ఆల్‌జెల్‌-ఐఎండీజీ అడ్జువాంట్‌ను జోడించినందున, దీనికి ఉన్న రోగ నిరోధక శక్తి (టీ-సెల్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌) పెరిగి, కొవిడ్‌-19 నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ లభిస్తుందని వివరించింది.

పూర్తి స్థాయి దేశీ టీకా

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో పూర్తిగా మనదేశంలో తయారైన ‘కొవాగ్జిన్‌’ టీకా శాస్త్ర సాంకేతిక రంగంలో మన సత్తాను ప్రపంచానికి చాటిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ అన్నారు. ‘కేవలం 8 నెలల వ్యవధిలోనే దీన్ని సాధించాం, తద్వారా ప్రపంచంలో తలెత్తుకుని నిలబడ్డాం’ అని అన్నారాయన. టీకాల తయారీలో సూపర్‌ పవర్‌గా మనం ఎదుగుతున్నామని ఆయన విశ్లేషించారు. కరోనా వైరస్‌ను గత ఏడాది మార్చిలో ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ‘ఐసొలేట్‌’ చేసి, టీకా తయారీ నిమిత్తం దాన్ని భారత్‌ బయోటెక్‌కు అందించింది. రోజురోజుకూ కొత్త సవాళ్లు విసురుతున్న కొవిడ్‌-19 వ్యాధి నుంచి కాపాడుకోడానికి మనదేశానికి ‘కొవాగ్జిన్‌’ రూపంలో బలమైన ఆయుధం దొరికినట్లు అయ్యిందని నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సమిరన్‌ పాండా అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని