close

Published : 05/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షిప్త వార్తలు

ఉద్యోగులు- కుటుంబ సభ్యుల టీకా ఖర్చు భరిస్తాం: క్యాప్‌జెమిని 

దిల్లీ: భారతదేశంలోని తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్‌ టీకా వేసేందుకు అయ్యే ఖర్చు భరిస్తామని ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమిని ఇండియా ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. భారత్‌లోని తమ వైద్య ప్రయోజనాల ప్రోగ్రామ్‌లో భాగమైన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు టీకా వేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తామని తెలిపింది.
విప్రో కూడా: ఉద్యోగులకు కొవిడ్‌ టీకా ఖర్చును తిరిగి చెల్లించాలా లేదంటే భాగస్వాములతో జట్టు కట్టడమా అనే విషయంపై యోచన చేస్తున్నామని విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ సీఈఓ వినీత్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతానికైతే ఉద్యోగులకు అయ్యే టీకా ఖర్చును మాత్రమే భరించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.


చమురు ఉత్పత్తి కోతల్లో మార్పుల్లేవ్‌

ఫ్రాంక్‌ఫర్ట్‌: ప్రస్తుతం అమలవుతున్న చమురు ఉత్పత్తి కోతల్లో మార్పులు చేయరాదని ఒపెక్‌, అనుబంధ దేశాలు నిర్ణయించాయి. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్‌ దేశాలు, రష్యా నేతృత్వంలోని ఇతర దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. సౌదీ అరేబియా అమలు చేస్తున్న రోజుకు 10 లక్షల బ్యారెళ్ల స్వచ్ఛంద ఉత్పత్తి కోతలు కనీసం ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో బ్యారెల్‌ ముడిచమురు ధర 5 శాతం పెరిగి 65 డాలర్ల దరిదాపుల్లో ట్రేడవుతోంది.


ఇక కంప్యూటర్లపైనా వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాల్స్‌

దిల్లీ: ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ల ద్వారా వినియోగదారులు వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునే సౌలభ్యాన్ని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ సదుపాయం వాట్సాప్‌ మొబైల్‌ యాప్‌లోనే ఉంది. వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌పై వాయిస్‌, వీడియో కాల్స్‌ పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ చేసినవని, ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా వినియోగదారులు చేసుకునే కాల్స్‌ను వినడం లేదా చూసే పద్ధతులు వాట్సాప్‌ చేయదని వెల్లడించింది. ‘వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌పై కాల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చాం. వినియోగదారులకు నమ్మకమైన, అధిక నాణ్యత కలిగిన సేవలను అందించనున్నాం. భవిష్యత్‌లో గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్స్‌ ఫీచర్‌ను సైతం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ’ని వాట్సాప్‌ తెలిపింది.


కాగ్నిజంట్‌ ఉద్యోగులకు బోనస్‌, పదోన్నతులు

దిల్లీ: ఉద్యోగులకు బోనస్‌, పదోన్నతులు ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ ప్రకటించింది. సంస్థలో అంతర్జాతీయంగా ఉన్న 2.9 లక్షల మంది ఉద్యోగుల్లో 2 లక్షలకు పైగా భారత్‌లోనే ఉన్నారు. 2019 ఏడాది కంటే ఎక్కువగా బోనస్‌, ప్రతి స్థాయిలో 24,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపింది. పెరుగుతున్న వలసలను నిరోధించడానికే కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని