close

Published : 06/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి హైకోర్టుకు కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీల నిర్ణయంపై రిట్‌ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తన వద్ద ఉన్న ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను స్టాక్‌ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీ సంస్థలు ‘బిడ్డింగ్‌’ విధానంలో విక్రయించడాన్ని సవాలు చేస్తూ, కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ముంబయి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీ సంస్థలతో పాటు కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వద్ద ఉన్న ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను బిడ్డింగ్‌ పక్రియలో సొంతం చేసుకున్న ఐఐఎఫ్‌ఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ను సైతం ప్రతివాదులుగా చేర్చినట్లు తెలిసింది.
కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లిమిటెడ్‌ లైసెన్సును రద్దు చేయడంతో పాటు దానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెబీ సూచనల మేరకు బ్యాంకుల వద్ద తనఖా ఉన్న, కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్లకు చెందిన షేర్లను మళ్లీ ఖాతాదార్లకే డిపాజిటరీ సంస్థలు బదిలీ చేశాయి. తాజాగా కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వద్ద ఉన్న ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను స్టాక్‌ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీ సంస్థలు విక్రయానికి పెట్టాయి. దీనికోసం నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో... ట్రేడింగ్‌ ఖాతాలను యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, డీమ్యాట్‌ ఖాతాలను ఐఐఎఫ్‌ఎల్‌ సొంతం చేసుకున్నాయి. అనంతరం కార్వీ ఖాతాదార్లను ఈ రెండు సంస్థలు సంప్రదిస్తున్నాయి. కేవైసీ పత్రాలు సమర్పిస్తే... ఇకపై తమ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద ట్రేడింగ్‌ చేసుకోవచ్చని ఈ సంస్థలు కార్వీ ఖాతాదార్లకు సమచారం ఇస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లిమిటెడ్‌ న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ చేసింది. వచ్చే వారంలో ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుందని తెలిసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని