close

Published : 06/03/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.38 లక్షల కోట్ల తయారీ

పీఎల్‌ఐ పథకంతో అయిదేళ్లలో సాధ్యం
నిబంధనలు సరళీకరిస్తాం  
రవాణా వ్యయాలూ తగ్గించే యత్నం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం వల్ల వచ్చే అయిదేళ్లలో దేశీయ తయారీ 52,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.38 లక్షల కోట్లు) మేర పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంచనా వేశారు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పీఎల్‌ఐ పథకం వెబినార్‌లో ప్రధాని పలు అంశాలపై మాటాడారు.
ఉద్యోగాలు రెట్టింపు: దేశీయ తయారీకి ప్రోత్సాహమిచ్చేందుకు ప్రభుత్వం సంస్కరణలు కొనసాగిస్తూనే ఉంది. పీఎల్‌ఐ పథకం కోసం వచ్చే అయిదేళ్లకు రూ.2 లక్షల కోట్లు బడ్జెట్‌లో ప్రకటించాం. తయారీలో సగటున 5 శాతం మేర ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. దీని వల్ల అయిదేళ్ల కాలంలో 52000 కోట్ల డాలర్ల మేర ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఈ పథక ప్రయోజనాలను అందిపుచ్చుకుంటున్న రంగాల్లో ఉద్యోగాలు రెట్టింపు అవుతాయి. నిబంధనలు సరళీకరించేందుకు కృషి చేస్తున్నాం. సులభతర వ్యాపారాన్ని మెరుగుపరుస్తాం. రవాణా వ్యయాలను తగ్గిస్తాం.
జిల్లాల స్థాయిలో ఎగుమతి కేంద్రాలు
గత 6-7 ఏళ్లలో భారత్‌లో తయారీని వివిధ స్థాయిల్లో ప్రోత్సహించడానికి పలు చర్యలు తీసుకున్నాం. ఈ వేగాన్ని మరింత పెంచితే, ఇంకా ఉద్యోగాలొస్తాయి. రవాణా ఖర్చులు తగ్గించడానికి మల్టీ మోడల్‌ మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 6000కు పైగా ఉన్న నిబంధనల భారాన్ని తగ్గించడానికి యత్నిస్తున్నాం. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల పరిష్కారానికి బదులు సమస్యలే తలెత్తుతాయి. అందుకే స్వీయ-నియంత్రణ,  ధ్రువీకరణలను తీసుకొస్తాం. గత ప్రభుత్వాలు అమలుచేసిన పథకాల్లో ముడిపదార్థాల ఆధారిత సబ్సిడీలు ఉండేవి. మేం తెస్తున్నవి లక్ష్యిత, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు. పీఎల్‌ఐ కిందకు 13 రంగాలు వస్తాయి. దీని వల్ల మొత్తం అన్ని రంగాలు ప్రయోజనాలు పొందుతాయి.


ఆయా రంగాల్లో ప్రయోజనాలు ఇలా..

వాహన, ఫార్మా: వాహన విడిభాగాలు, వైద్య సామగ్రి, ఔషధాల ముడిపదార్థాల విషయంలో విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది.
ఇంధన, వ్యవసాయ రంగం: అధునాతన సెల్‌ బ్యాటరీలు, సోలార్‌ పీవీ మాడ్యుళ్లు, స్పెషాలిటీ స్టీల్‌ వల్ల దేశంలో ఇంధన రంగం ఆధునికతను సంతరించుకుంటుంది. 2023ను తృణధాన్యాల ఏడాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్‌ రంగాలు దీని ప్రయోజనాలు పొందాలి.
ఐటీ: ఐటీ హార్డ్‌వేర్‌, టెలికాం సామగ్రి తయారీకి కల్పించిన ప్రయోజనాల వల్ల నాలుగేళ్లలో రూ.3 లక్షల కోట్ల విలువైన ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి జరగనుంది. దేశీయ విలువ జోడింపు అయిదేళ్లలో 5-10% నుంచి 20-25 శాతానికి చేరుతుంది. టెలికాం సామగ్రి కూడా అయిదేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తులనును ఎగుమతి చేయొచ్చు.
ఫార్మా: వచ్చే 5-6 ఏళ్లలో  రూ.15,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. దీని వల్ల రూ.3 లక్షల కోట్ల ఫార్మా విక్రయాలు; రూ.2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు పెరగొచ్చు.  
మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌: కరోనా సమయంలోనూ రూ.1300 కోట్ల తాజా పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి వేల కొద్దీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని