కరోనా సవాళ్ల నుంచి బయటపడ్డాం..
2020-21లో హైదరాబాద్ ఐటీ 6-7 శాతం వృద్ధి
డిసెంబరు నాటికి 70 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు
ఐటీ పరిశ్రమపై హైసియా విశ్లేషణ
ఈనాడు - హైదరాబాద్
కొవిడ్-19 సవాళ్ల నుంచి ఐటీ పరిశ్రమ ఊహించినదానికన్నా వేగంగా కోలుకుందని, దీంతోపాటు పలు విభాగాల్లో ఆశాజనకమైన వృద్ధి కనిపిస్తోందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ, ఐటీ సేవల పరిశ్రమ 2.6శాతం వరకూ వృద్ధి చెందే అవకాశం ఉందని, హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో ఇది 6-7శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నట్లు హైసియా అధ్యక్షుడు భరణి కె అరోల్ తెలిపారు. సోమవారం ఆయన, హైసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్ రావుతో కలిసి ‘ఈనాడు’తో మాట్లాడారు. 2020-21లో ఐటీ రంగంలో సున్నా లేదా మైనస్ వృద్ధి ఉంటుందని అంచానాలున్నాయనీ, కానీ, పరిశ్రమ సవాళ్లను దీటుగా ఎదుర్కొందని ఈ సందర్భంగా వారు వివరించారు.
రూ.1.50లక్షల కోట్ల ఎగుమతులు
తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతుల విలువ 2019-20లో రూ.1.28లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.40లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ రూ.1.50లక్షల కోట్లకు చేరుకోవచ్చు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో మరింత వృద్ధి కనిపించే అవకాశం ఉందని భరణి పేర్కొన్నారు. ‘మాంద్యం నుంచి బయటపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఐటీపై చేస్తున్న ఖర్చు 3-4శాతం పెరగడంలాంటివి కలిసొచ్చే అంశాలు. చాలా రంగాల్లో ఈ ఖర్చు సాధారణ స్థితికి చేరుకుంది. విదేశీ సంస్థలు ఇక్కడి వారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతా రిమోట్ వర్కింగ్ కావడంతో వారికి ఇబ్బందేమీ ఉండటం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 శాతం ఐటీ ఉద్యోగులే కార్యాలయాలకు వెళ్తున్నారు. జూన్ నుంచి ఈ సంఖ్య 30-35 శాతం వరకూ చేరొచ్చు. ఈ ఏడాది చివరినాటికి 60-70% మంది కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఉంద’ని చెప్పారు.
క్లౌడ్ కంప్యూటింగ్ కోసం..
క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్ల అభివృద్ధికి వీలుగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ)ని ఏర్పాటు చేయబోతున్నట్లు భరణి తెలిపారు. దీనికోసం రెండు ప్రముఖ సంస్థలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ క్యాంపస్ నియామకాలు, ఇంటర్న్‌షిప్ కోసం ఒక ప్రత్యేక వేదికను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇది నెలలోపే అందుబాటులోకి వస్తుందన్నారు. ఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు విధాన నిర్ణయాల కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైసియా ద్వారా పలు సూచనలు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు ఇంజినీరింగ్ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్అండ్డీ)పైనా విధాన పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలియజేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు, దీనికి కాగ్నిజెంట్ ఎండీతో సహా పలువురు సీఈఓలు హాజరవుతారని తెలిపారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?