క్రిప్టోకరెన్సీలపై ఆందోళనలున్నాయ్‌
close

Updated : 26/03/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిప్టోకరెన్సీలపై ఆందోళనలున్నాయ్‌

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: మార్కెట్లో ట్రేడవుతున్న క్రిప్టో కరెన్సీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (ఆర్‌బీఐ) తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు. ఈ విషయంలో ఆర్థిక శాఖతో అభిప్రాయభేదం లేదని, ప్రభుత్వ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఆర్థిక సదస్సులో దాస్‌  పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాయని నొక్కిచెప్పారు. ప్రభుత్వం కూడా తమ ప్రధాన ఆందోళనలతో ఏకీభవిస్తుందనే విశ్వాసాన్ని దాస్‌ వ్యక్తం చేశారు.ఫియట్‌ కరెన్సీ డిజిటల్‌ వెర్షన్‌పై ఆర్‌బీఐ ప్రస్తుతం పని చేస్తోందని, అలాంటి సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థలో తలెత్తే ఆర్థిక స్థిరత్వ చిక్కులను అంచనా వేస్తున్నామని దాస్‌ వెల్లడించారు.
కంపెనీలు క్రిప్టోకరెన్సీల్లో జరిపిన లావాదేవీల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించింది.
క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తూ ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గతేడాది కొట్టివేసిన సంగతి తెలిసిందే. గత జనవరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో కూడా క్రిప్టోకరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం ప్రతిపాదించారు. అయితే ఈ నెల ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ క్రిప్టోకరెన్సీలకు పూర్తిగా ద్వారాలు మూసేయలేదని, ఈ కరెన్సీలపై ప్రయోగాల్ని ప్రోత్సహిస్తామని ప్రకటించడంతో గందరగోళం తలెత్తింది.

లాక్‌డౌన్‌లు ఉండకపోవచ్చు
దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ కేసులు పెరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజంపై ప్రభావం పడకపోవచ్చని శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లాక్‌డౌన్‌లు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక రికవరీకి టీకాల కార్యక్రమం బీమాలా భద్రత కల్పిస్తుందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీ వృద్ధి 10.5 శాతాన్ని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తగ్గించాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంచనాలను వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ వెల్లడిస్తుందన్నారు. దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 18 నెలల  దిగుమతులకు సరిపడా ఉన్నాయన్నారు.

4 రకాలతో భిన్నమైన బ్యాంకింగ్‌ రంగం
దేశంలో వచ్చే దశాబ్ద కాలంలో 4 రకాల బ్యాంకుల్ని మాత్రమే చూడొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా వేశారు. అవి కూడా పోటీతత్వంతో, సమర్థంగా పని చేస్తాయన్నారు. దేశం, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థలో మధ్య స్థాయి బ్యాంకులు, చిన్న రుణ గ్రహీతలు, డిజిటల్‌ సంస్థల కోసం చిన్న రుణ బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/సహకార సంస్థలు ఉంటాయన్నారు. ప్రస్తుతం 10 చిన్న రుణ బ్యాంకులు, 6 పేమెంట్స్‌ బ్యాంకులు మనుగడలో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్‌ రంగం కోసం బలమైన మూలధన ఆధారిత, నీతివంతమైన కార్పొరేట్‌ పాలన ఆర్‌బీఐ  ప్రాధాన్యాలుగా ఉంటాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సంప్రదింపులు సాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇంకా ముందుకు సాగాల్సి ఉందన్నారు.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని