మిస్త్రీపై టాటాల విజయం
close

Updated : 27/03/2021 07:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిస్త్రీపై టాటాల విజయం

గ్రూప్‌ ఛైర్మన్‌గా సైరస్‌ పునర్నియామక ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
దిల్లీ

టాటా గ్రూపు, సైరస్‌ మిస్త్రీ మధ్య నాలుగేళ్లుగా జరిగిన న్యాయపోరాటంలో టాటాలదే పైచేయి అయ్యింది. 100 బిలియన్‌ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌నకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పుతో టాటా గ్రూపు, సైరస్‌ మిస్త్రీల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం దాదాపుగా ముగిసినట్లే అనుకోవచ్చు. టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌)లో విభజనకు సంబంధించి యాజమాన్య ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ సైరస్‌మిస్త్రీకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘టాటా గ్రూపు పిటిషన్లలోని న్యాయపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. టాటా గ్రూపు పిటిషన్లను స్వీకరించాల్సి ఉంటుంది. షాపూర్‌ జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూపు పిటిషన్లను తిరస్కరించాల్సి ఉంటుంది. అందువల్ల ఒకటి మినహా అన్ని అప్పీళ్లను స్వీకరిస్తున్నాం. 2019 డిసెంబరు 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన ఆర్డర్లను పక్కకు పెడుతున్నామ’ని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై గతేడాది జనవరి 10న సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.
వాటా లెక్కలు మీరే తేల్చుకోండి..  
టాటా గ్రూపు నుంచి ఎస్‌పీ గ్రూపు వేరుపడటానికి సంబంధించి నెలకొన్న వివాదంపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆ వాటా లెక్కలు ఇరుపక్షాలే తేల్చుకోవాలని తెలిపింది. నమోదిత ఆస్తులు, స్థిరాస్తులు, ఇతరత్రా వాటిల్లో టాటా సన్స్‌కు ఉన్న వాటాల విలువపై ఆధారపడి ఎస్‌పీ గ్రూపు షేర్ల విలువ ఉంటుందని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి సూచనలు కానీ, ఆదేశాలు కానీ ఈ సమయంలో కోర్టు ఇవ్వబోదని పేర్కొంది. ఆర్టికల్‌ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాల్లో వాటా లెక్కల వివాదానికి ఇరు పక్షాలే పరిష్కారం వెతుక్కోవాలని సూచించింది.
టాటా సన్స్‌లో తమ 18.37 శాతం వాటాల విలువ రూ.1.75 లక్షల కోట్ల వరకు ఉంటుందని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపు లెక్కగట్టగా.. రూ.70,000- 80,000 కోట్లకు మించి ఉండదని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా టాటా గ్రూపు తెలియజేసింది.

మా ప్రమాణాలు, విలువలకు ఈ తీర్పే నిదర్శనం..
ఎన్నో ఏళ్లుగా తాము పాటిస్తున్న పాలనా ప్రమాణాలకు సైరస్‌ మిస్త్రీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే నిలువెత్తు నిదర్శనమని టాటా గ్రూపు తెలిపింది. ఈ తీర్పుతో టాటా సన్స్‌ ఔన్నత్యమేమిటో నిరూపితమైందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘నా సమగ్రత, గ్రూపు నైతిక ప్రవర్తనపై పదేపదే ఆరోపణలు చేశారు. టాటా సన్స్‌ పిటిషన్‌లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. మా నైతికతకు, మా గ్రూపునకు మార్గనిర్దేశం చేస్తున్న విలువలకు నిదర్శనమ’ని ఆయన ట్వీట్‌ చేశారు.

మిస్త్రీపై కోర్టు వ్యాఖ్యలివీ
‘తనకు చట్టబద్దంగా రావాల్సింది అందలేదనే కోపంతో, తన ఇంటికే నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి, ఆ ఇంటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో భాగం అయ్యేందుకు అర్హుడు కాదు.  టాటా సన్స్‌లో 18.37 శాతం వాటా కలిగిన వాటాదార్లకు ప్రాతినిథ్యం వహిస్తూ, ఆ గ్రూప్‌నకు వారసుడిగా గుర్తింపు పొంది కూడా, అదే బోర్డును తప్పుపట్టడం అనేది మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలకు క్షేమకరం కాదని భావిస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. డైరెక్టరుగా ఉంటూనే 2016 అక్టోబరు 25న మిస్త్రీ తన మెయిల్‌ను మీడియాకు లీక్‌ చేయడంతో పాటు, ఆదాయపు పన్ను విభాగానికి 4 బాక్స్‌ ఫైల్స్‌తో సమాధానాలు ఇచ్చారని తెలిపింది. ఇందువల్ల ఆయన్ను టాటా సన్స్‌, ఇతర గ్రూప్‌ కంపెనీల నుంచి డైరెక్టరుగా తొలగించడమూ న్యాయమేనని వివరించింది.



Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని