ఫార్మా ఉద్యోగులందరికీ కొవిడ్‌-19 టీకా ఇవ్వాలి
close

Published : 01/04/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫార్మా ఉద్యోగులందరికీ కొవిడ్‌-19 టీకా ఇవ్వాలి

విధులకు హాజరవుతున్న వారికి సోకుతున్న మహమ్మారి
దానివల్ల మందుల ఉత్పత్తిపై ప్రభావం
కేంద్ర ప్రభుత్వానికి ఫార్మాగ్జిల్‌  డైరెక్టర్‌ జనరల్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగో దశ కొవిడ్‌-19 టీకాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బందికి టీకా ఇవ్వాలని ఫార్మాగ్జిల్‌ (ఫార్మాసూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) కోరింది. ఈ మేరకు ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ కేంద్ర ప్రభుత్వ ఆర్యోగ- కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఊహించని రీతిలో ముంచుకొచ్చిన కొవిడ్‌-19 మహమ్మారికి మనదేశంలోని ఔషధ పరిశ్రమ ఎదిరించి నిలవటమే కాకుండా 150 దేశాలకు మందులు సరఫరా చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా తయారీ రంగంలో వృద్ధి మందగించగా, మన ఔషధ పరిశ్రమ మాత్రం వృద్ధి బాటలో ముందుకు సాగిందని ఉదయ భాస్కర్‌ వివరించారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మనదేశం 21.50 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు నమోదు చేసిందని తెలిపారు. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 12.25 శాతం పెరుగుదలగా వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో దేశీయ ఔషధ పరిశ్రమ కొవిడ్‌-19 టీకా తయారు చేసిందని, దీన్ని ‘వ్యాక్సిన్‌ మైత్రి’ కార్యక్రమం కింద 82 దేశాలకు ప్రభుత్వం సరఫరా చేసిందని  తెలిపారు. ఫార్మా పరిశ్రమ నిరంతరం పనిచేయటంతోనే ఇది సాధ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ‘అత్యవసర పరిశ్రమ’ కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఫార్మా సిబ్బంది విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పలువురు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఫార్మా పరిశ్రమ సిబ్బంది కోసం వెంటనే ‘వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌’ చేపట్టాలని ఆయన కోరారు. తద్వారా ఫార్మా పరిశ్రమలోని ఉద్యోగులు మనదేశానికి, ఇతర దేశాలకు అవసరమైన మందులు తయారు చేయగలుగుతారని పేర్కొన్నారు.
‘ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌’ గడువు పొడిగింపు: ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్న మందుల తయారీ యూనిట్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ‘ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌’ అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో గడువు పొడిగించాల్సిన అవసరం ఉందని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖకు నివేదించగా, అందుకు సానుకూలమైన స్పందన వచ్చింది. అమలు తేదీని వాయిదా వేస్తూ డీజీఎఫ్‌టీ (డైరెక్టర్‌ జనరల్‌ ఫారిన్‌ ట్రేడ్‌) పబ్లిక్‌ నోటీసు జారీ చేశారు. ఎస్‌ఎస్‌ఐ, నాన్‌-ఎస్‌ఎస్‌ఐ యూనిట్లన్నింటికీ ఇది వర్తిస్తుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని