ఇంకొంత కాలం ఉక్కుపోతే!
close

Published : 01/04/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంకొంత కాలం ఉక్కుపోతే!

ఇప్పటికే కొండెక్కిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్య గిరాకీ
వినియోగదార్లపై పెనుభారం
ఈనాడు - హైదరాబాద్‌

స్టీలు ధరలు మండిపోతున్నాయి. ‘కరోనా’ ముప్పు వల్ల తగినంతగా ఉత్పత్తి లేకపోవటం, అదే సమయంలో వినియోగం భారీగా పెరగటంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే కొంతకాలం పాటు స్టీలు ధరలు అధికంగానే ఉండే పరిస్థితి కనిపిస్తోందని రేటింగ్‌ సేవల సంస్థ ‘ఇక్రా’ పేర్కొంది. ఎగుమతులు ఆకర్షణీయంగా మారటంతో మనదేశం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టీలు అధికంగా ఎగుమతి అయ్యింది. అంతకు ముందు ఏడాది ఇదేకాలంతో పోల్చితే స్టీలు ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జనవరితో పోల్చి చూసినా, ఫిబ్రవరిలో స్టీలు ఎగుమతులు 25 శాతం పెరిగాయి. ఇటీవల కాలంలో మనదేశంలో మళ్లీ కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. దీనివల్ల నిర్మాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గి స్టీలు వినియోగం తగ్గుతుందనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ధరలు తగ్గే అవకాశం లేదని, అంతర్జాతీయంగా స్టీలుకు అధిక డిమాండ్‌ ఉండటమే దీనికి కారణమని ఇక్రా విశ్లేషించింది. దీనివల్ల వినియోగదార్లు అధిక ధరల భారాన్ని మోయటానికి సిద్ధపడవలసి వస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ స్టీలు వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన 11 నెలల కాలానికి స్టీలు వినియోగం అంతకు ముందే ఏడాది ఇదేకాలంతో పోల్చి చూస్తే 9.9 శాతం మాత్రమే తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో స్టీలు ధర అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా అధికంగా ఉండటం గమనార్హం. చైనా హెచ్‌ఆర్‌సీ (హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ఎగుమతి ధర టన్నుకు 768 డాలర్లు పలుకుతోంది. దీనికి నౌక రవాణా ఛార్జీలు అదనం. దీనివల్ల చైనా నుంచి హెచ్‌ఆర్‌సీ స్టీలు దిగుమతి చేసుకుంటే, దేశీయ ధర కంటే 10 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల దేశీయ వినియోగం కొంత తగ్గినా స్టీలు ధరలు ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి కనిపించటం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
స్టీలు షేర్లకు గిరాకీ...
వచ్చే కొంతకాలం పాటు హాట్‌-రోల్డ్‌ కాయిల్స్‌, రీబార్స్‌ ధరలు అధికంగానే ఉంటాయనే  అంచనాలతో స్టాక్‌మార్కెట్లో స్టీలు కంపెనీల షేర్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం టన్ను స్టీలు కొనాలంటే రూ.54,000 వరకూ చెల్లించాల్సి వస్తోంది. అదే దిగుమతి చేసుకుంటే రూ.60,000-65,000 దాకా ఖర్చవుతోంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో  ధరలు ఇంకా పెరిగే పరిస్థితుల్లో స్టీలు షేర్లకు రెక్కలు వచ్చాయి. టాటా స్టీలు, జేఎస్‌డబ్ల్యూ స్టీలు, సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌ తదితర కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ధరలు పలుకుతున్నాయి. టాటా స్టీలు బీఎస్‌ఈలో బుధవారం 52 వారాల గరిష్ఠ ధర (రూ.823.50) నమోదు చేసింది. చివరికి రూ.811.95 వద్ద ముగింపు ధర నమోదైంది. జేఎస్‌డబ్ల్యూ సైతం ఇదే విధంగా రూ.473.65 గరిష్ఠ ధర (52 వారాల అత్యధికం) పలికి, చివరికి రూ.467.85 ముగింపు ధర నమోదు చేసింది. సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌ గరిష్ఠ ధరల వద్ద కనిపిస్తున్నాయి.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ దేశీయ తయారీ పెరగాలి...
స్టెయిన్‌లెస్‌ స్టీలు ఉత్పత్తి మనదేశంలో గత ఏడాదిలో 19 శాతం తగ్గినట్లు ఐఎస్‌ఎస్‌డీఏ (ఇండియన్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌) వెల్లడించింది. గత ఏడాదిలో 3.17 మిలియన్‌ టన్నుల స్టెయిన్‌లెస్‌ స్టీలు (అంతకు ముందు ఏడాదిలో 3.93 మిలియన్‌ టన్నులు) మనదేశంలో తయారైంది. కొవిడ్‌-19 మహమ్మారితో గత ఏడాదిలో ఉత్పత్తి కార్యకలాపాలు మందగించినట్లు, కొన్ని యూనిట్లు మూతపడినట్లు ఐఎస్‌ఎస్‌డీఏ పేర్కొంది. గత ఏడాదిలో ప్రపంచ స్టెయిన్‌లెస్‌ స్టీలు ఉత్పత్తి 50.9 మిలియన్‌ టన్నుల మేరకు ఉండగా, అందులో 50 శాతం వాటా చైనాదే. ఈ నేపథ్యంలో మనదేశంలో స్టెయిన్‌లెస్‌ స్టీలు ఉత్పత్తిని గణనీయంగా పెంచటానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐఎస్‌ఎస్‌డీ…ఏ అధ్యక్షుడు కేకే పాహుజా కోరారు. చైనా, ఇండోనేషియా నుంచి స్టెయిన్‌లెస్‌ స్టీలు దిగుమతులు ముంచెత్తే ప్రమాదం ఉందని, దాన్ని నివారించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని