close

Published : 11/04/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలీబాబాకు 2.8 బి.డాలర్ల జరిమానా

పోటీ నిబంధనల ఉల్లంఘన నేపథ్యం

బీజింగ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్‌ సంస్థ, జాక్‌మా నేతృత్వంలోని అలీబాబా గ్రూపునకు 18.23 బిలియన్‌ యువాన్‌ (2.8 బిలియన్‌ డాలర్లు)ల జరిమానాను చైనా నియంత్రణ సంస్థలు విధించాయి. నాలుగు నెలలు పాటు జరిపిన దర్యాప్తులో గుత్తాధిపత్యం కోసం అలీబాబా 2015 నుంచి పోటీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని తేల్చి ఈ నిర్ణయం తీసుకున్నాయి. వ్యాపారులను విక్రయ కేంద్రాలు ప్రారంభించకుండా అడ్డుకోవడం, ఇతర పోటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ఆపడం లాంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆ దర్యాప్తులో వెల్లడైందని చైనా అధికారిక ఛానల్‌ సీజీటీఎన్‌ టీవీ వెల్లడించింది. దీంతో 2019లో అలీబాబా నమోదు చేసిన విక్రయాల విలువ 455.711 బిలియన్‌ యువాన్‌ (69.5 బిలియన్‌ డాలర్లు)లో 4 శాతం అంటే 18.23 బిలియన్‌ యువాన్‌లను స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌ జరిమానా విధించిందని పేర్కొంది. దేశంలోని సాంకేతిక దిగ్గజాలకు కళ్లెం వేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. యాంట్‌ గ్రూపు ఎక్స్ఛేంజీలో నమోదు కాకుండా గత నవంబరులోనూ చైనా నియంత్రణ సంస్థలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ జరిమానా విధింపు అలీబాబాకు మరో కుదుపుగా భావించవచ్చు. అలీబాబా లాంటి దిగ్గజ సాంకేతిక కంపెనీ ఏదైనా గుత్తాధిపత్యం ప్రదర్శించాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాన్ని ఈ పరిణామం ద్వారా మరోమారు ప్రపంచానికి చైనా ప్రభుత్వం సంకేతమిచ్చింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని