close

Published : 12/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఫలితాలు కీలకం

ఊగిసలాటకే ఎక్కువ అవకాశం

టీసీఎస్‌, ఇన్ఫీ, విప్రో, మైండ్‌ట్రీ గణాంకాలు ఈ వారంలోనే

ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీలకు సానుకూలతలు

బుధవారం మార్కెట్లకు సెలవు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

కార్పొరేట్‌ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, కరోనా మలి దశ వార్తల మధ్య దేశీయ సూచీలు ఈవారం ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. టీసీఎస్‌ నేడు (సోమవారం) ప్రకటించే గణాంకాలతో ఆర్థిక ఫలితాల సీజను మొదలు కానుంది. ఐటీ కంపెనీల ఫలితాలు బలంగానే నమోదు కావొచ్చన్న అంచనాలున్నప్పటికీ.. కరోనా మలిదశ నేపథ్యంలో ఆయా సంస్థలు భవిష్యత్‌ అంచనాలపై చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.  ఈ వారం నిఫ్టీ 14,600-15,200 శ్రేణిలో కదలొచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచీ; మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారమే వెల్లడవుతాయి. వీటి నుంచీ మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ, రసాయనాల కంపెనీలపై విశ్లేషకులు బులిష్‌గా ఉన్నారు. వివిధ రంగాలపై వారేమంటున్నారంటే..
* ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడొచ్చు. మార్చి త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు ఇందుకు నేపథ్యం.
* కంపెనీలు ఈ ఏడాది వృద్ధిపై వెలువరచే అంచనాలు ఐటీ షేర్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. సోమవారం టీసీఎస్‌, బుధవారం ఇన్ఫోసిస్‌, గురువారం విప్రో, శుక్రవారం మైండ్‌ట్రీలు ఫలితాలు వెల్లడించనున్నాయి.  
* బలమైన ఫలితాలపై అంచనాలకు తోడు దేశీయంగా గిరాకీ బాగుండడంతో లోహ షేర్లు.. ముఖ్యంగా ఉక్కు సంస్థల షేర్లు లాభాలు కొనసాగించొచ్చు.
* సోమవారం సియామ్‌ వెల్లడించే టోకు విక్రయ గణాంకాల నుంచి వాహన షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. భవిష్యత్తు గిరాకీపై సియామ్‌, వాహన తయారీసంస్థలు వెల్లడించే అంచనాలపై మదుపర్లు ఆసక్తికనబరచవచ్చు.
* ఔషధ కంపెనీలపై మార్కెట్‌ వర్గాలు కన్నేయొచ్చు. పారాసెట్మాల్‌, ఫావిపిరవిర్‌, యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, రెమ్‌డెసివిర్‌లకు మళ్లీ గిరాకీ పెరుగుతుందన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.
* ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అంతర్లీనంగా ప్రతికూల ధోరణి కనిపించవచ్చు. రిఫైనరీ కంపెనీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు ఎక్కువ బలంగా కనిపిస్తున్నాయి.  
* బ్యాంకు షేర్లలో ట్రేడింగ్‌ ఎంపిక చేసిన స్క్రిప్‌లలో జరగనుంది. అంతర్లీనంగా సానుకూల సెంటిమెంటు కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్‌ సూచీకి 33000 వద్ద నిరోధ స్థాయి కనిపిస్తోంది.
* ధరల పెంపు కారణంగా సిమెంటు కంపెనీల షేర్లు లాభాలు అందుకోవచ్చు.  
* టారిఫ్‌ పెంపు మరింత ఆలస్యమవుతుందన్న భావనల మధ్య టెలికాం కంపెనీల షేర్లు ఒత్తిడిలోనే కొనసాగొచ్చు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నందున కొత్త వినియోగదార్ల సంఖ్య తగ్గొచ్చు.
* యంత్ర పరికరాల షేర్లు లాభాలందుకోవచ్చు. మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదవుతాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని