close

Published : 14/04/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ ఏడాది ఇంక్రిమెంట్ల జోరు

 59% దేశీయ సంస్థల సుముఖత

జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అధ్యయనం

ముంబయి: వేతన జీవులకు ఇది శుభవార్తే. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులు వేస్తుండటంతో ఈ ఏడాది తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం ద్వారా వేతనాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నామని 59 శాతం దేశీయ సంస్థలు తెలిపినట్లు స్టాఫింగ్‌ కంపెనీ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అధ్యయనం పేర్కొంది. ‘నియామకాలు, వలసలు, పరిహార ధోరణి 2021-22’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆన్‌లైన్‌లో 1,200 కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదికను రూపొందించినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ వివరించింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, నిర్మాణ, ఇంజినీరింగ్‌, విద్య/బోధన/శిక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, తయారీ, మీడియా, చమురు-గ్యాస్‌, ఔషధ, వైద్య, విద్యుత్తు, ఇంధన, స్థిరాస్తి, రిటైల్‌, టెలికాం, వాహన, వాహన అనుబంధ రంగాల్లోని కంపెనీలను సర్వే చేసినట్లు తెలిపింది.
*వేతన పెంపు (ఇంక్రిమెంట్‌) 5-10 శాతం మధ్య ఇవ్వాలనుకుంటున్నట్లు 59 శాతం సంస్థలు వెల్లడించాయి. 5 శాతం కంటే తక్కువ వేతన పెంపు ఇస్తామని 20 శాతం సంస్థలు పేర్కొన్నాయి.  వేతన పెంపునకు సిద్ధంగా లేమని 21 శాతం కంపెనీలు తెలిపాయి.
* కొత్త నియామకాలకు సిద్ధంగా ఉన్నామని 43 శాతం, ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో కొత్తవారిని  తీసుకుంటామని 41 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. కొత్త నియామకాలకు అవకాశమే లేదని 11 శాతం సంస్థలు తేల్చిచెప్పాయి.
* కొత్త ఉద్యోగావకాశాల్లో 37 శాతం దక్షిణాదిలో లభించనున్నాయి. పశ్చిమ ప్రాంతంలో 33 శాతం నియామకాలు ఉండనున్నాయి.
* శ్రామిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు 15 శాతం మంది కొత్త వారిని తీసుకుంటామని 21 శాతం సంస్థలు వెల్లడించాయి. 10-15 శాతం కొత్త ఉద్యోగులను తీసుకుంటామని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 10 శాతం కొత్త వారిని తీసుకుంటామని 30 శాతం కంపెనీలు పేర్కొనగా, కొత్త నియామకాలు ఉండవని 23 శాతం సంస్థలు తేల్చాయి.
* ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటిస్తామని 4 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. పశ్చిమ ప్రాంతంలోని కంపెనీల్లో ఎక్కువగా తొలగింపులు ఉండొచ్చు.  
* దూర ప్రాంతం నుంచి పని వల్ల ఉత్పాదకతలో మార్పు లేదని 33 శాతం, ఒడుదొడుకులున్నాయని 37 శాతం కంపెనీలు తెలిపాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని