close

Updated : 17/04/2021 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సఫ్రాన్‌ వైమానిక ఇంజిన్‌ విడిభాగాల పరిశ్రమ

మూడో త్రైమాసికంలో ప్రారంభం
కేటీఆర్‌తో భేటీలో సఫ్రాన్‌ సంస్థ ఛైర్మన్‌ మెకన్నెస్‌
పూర్తిగా సహకరిస్తామన్న మంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ సఫ్రాన్‌ శంషాబాద్‌లో రూ.290 కోట్లతో ఏర్పాటుచేస్తున్న విమానాల లీప్‌ టర్బోఫ్యాన్‌ ఇంజిన్ల విడిభాగాల తయారీ పరిశ్రమను ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనుంది. సంస్థ ఛైర్మన్‌ రాస్‌ మెకన్నెస్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుతో ప్రగతిభవన్‌లో భేటీ అయింది. సఫ్రాన్‌ సీనియర్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్‌ జిగ్లెర్‌, భారత విభాగ ఎండీ పియరీ డికెలి ఈ బృందంలో ఉన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు మెక్లెన్స్‌ తమ సంస్థ పురోగతిని కేటీఆర్‌కు వివరించారు. హైదరాబాద్‌లో సఫ్రాన్‌ ఎలక్ట్రికల్‌, విద్యుత్‌ పరిశ్రమ 2018లో ఏర్పాటు కాగా దీని ద్వారా లీప్‌ ఇంజిన్లు, రఫేల్‌, డిజిటల్‌ ఇంజిన్ల నియంత్రణ వ్యవస్థ, రఫేల్‌లను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. తమ సంస్థ 2020లో శంషాబాద్‌ వద్ద రూ.290 కోట్లతో లీప్‌ టర్బోఫ్యాన్‌ ఇంజిన్ల విడిభాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిందని, ఇందులో 13వేల చదరపు మీటర్లలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది సంస్థను ప్రారంభించాక, ఏటా 15వేల విడిభాగాల తయారీ ఇక్కడ చేపడతామని చెప్పారు. పరిశ్రమ ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమలుండగా.. సఫ్రాన్‌ పరిశ్రమ ద్వారా వైమానిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని