close

Updated : 20/04/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మో.. సోమవారం

కొవిడ్‌ భయాలతో కుదేలైన మార్కెట్లు
సెన్సెక్స్‌కు 883 పాయింట్ల నష్టం
రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఏప్రిల్‌ 5   - 870 పాయింట్ల నష్టం
ఏప్రిల్‌ 12  - 1708 పాయింట్ల నష్టం
ఏప్రిల్‌ 19  - 883 పాయింట్ల నష్టం

పై నష్టాలు చూశారుగా.. ఈ నెలలో సూచీలకు 3 భారీ నష్టాలూ సోమవారమే వచ్చాయి. సోమవారం అంటేనే మదుపర్ల వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన మార్కెట్లను కరోనా భయాలు అతలాకుతలం చేశాయి. దేశంలో కొవిడ్‌-19 కేసులు రోజుకు 2.70 లక్షలు మించడం, స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లతో వృద్ధిపై ఆందోళనలు  తీవ్రమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను బ్రోకరేజీ సంస్థలూ తగ్గించడం సెంటిమెంటును ప్రతికూలం చేసింది. ఇవి అమ్మకాల రూపంలో కనిపించగా.. రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
స్టాక్‌ మార్కెట్‌కు మరో బ్లాక్‌ మండే. అన్ని రంగాల షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 52 పైసలు డీలాపడి 74.87కు చేరడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.53 లక్షల కోట్లు తగ్గి రూ.201.77 లక్షల కోట్లకు చేరింది. ఆసియా మార్కెట్లు రాణించగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం భారీ నష్టాలతో 47,940.81 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కొద్దిసేపటికే 47,362.71 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అప్పటికి సెన్సెక్స్‌ నష్టం 1470 పాయింట్లు. అనంతరం కొంచెం కోలుకుని, 882.61 పాయింట్ల నష్టంతో 47,949.42 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 258.40 పాయింట్లు కోల్పోయి 14,359.45 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,191.40 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.

మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ షేర్ల అరంగేట్రం చేదుగా మొదలైంది. బీఎస్‌ఈలో ఇష్యూ ధరైన రూ.486తో పోలిస్తే 9.67 శాతం నష్టంతో రూ.439 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 13.34% కుదేలైన షేరు రూ.421.15 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.70 శాతం నష్టంతో రూ.463.15 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 3.33 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 1.10 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.
2 షేర్లకే లాభాలు ..
సెన్సెక్స్‌ 30 షేర్లలో 28 నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ అత్యధికంగా 4.17 శాతం కుదేలైంది. ఓఎన్‌జీసీ 3.91%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.89%, కోటక్‌ బ్యాంక్‌ 3.65%, ఎల్‌ అండ్‌ టీ 3.60%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.58%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.52%, ఎం అండ్‌ ఎం 3.33%, ఎన్‌టీపీసీ 3.22% చొప్పున డీలాపడ్డాయి.
డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌ మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి.
రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 3.96% పడింది. యంత్ర పరికరాలు, విద్యుత్‌, వాహన, ఫైనాన్స్‌, టెలికాం అదే బాటలో నడిచాయి. ఆరోగ్య సంరక్షణ మాత్రం పెరిగింది
బీఎస్‌ఈలో 2243 షేర్లు నష్టాల్లో ముగియగా, 742 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 187 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
ఆక్సిజన్‌ పేరే ఆ షేరును పరుగెత్తిస్తోంది!
స్టాక్‌ మార్కెట్‌ అంటేనే సెంటిమెంట్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు గిరాకీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆక్సిజన్‌ వ్యాపారంతో  సంబంధం లేనప్పటికీ.. పేరులో ఆక్సిజన్‌ ఉండటంతో, ఒక కంపెనీ షేరు విలువ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. ‘బాంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’ షేరు సోమవారం 5 శాతం దూసుకెళ్లి.. రూ.24,574 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి అక్కడే ముగిసింది. మార్చి ముగిసేనాటికి దాదాపు రూ.10000 స్థాయిలో ఉన్న షేరు.. ఈ కొన్ని రోజుల్లోనే భారీగా పరుగులు తీసింది. కంపెనీ పేరు వల్లే ఈ స్థాయిలో దూసుకెళ్లిందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కంపెనీ వెబ్‌సైట్‌లో వివరాలు భిన్నంగా ఉన్నాయి. 1960 అక్టోబరు 3న ‘బాంబే ఆక్సిజన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’గా అవతరించిన కంపెనీ.. 2018 అక్టోబరు 3న ‘బాంబే ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌’గా పేరు మార్చుకుంది. ప్రస్తుతం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు.. ఆర్‌బీఐ అనుమతులు ఉన్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని