close

Published : 04/05/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విక్రయానికి మళ్లీ యాహూ, ఏఓఎల్‌!

ఈ సారి 5 బిలియన్‌ డాలర్లకు

న్యూయార్క్‌: ఒకప్పటి ఇంటర్నెట్‌ దిగ్గజాలు ఏఓఎల్, యాహూలు మళ్లీ అమ్ముడుపోనున్నాయి. ఈ రెండు కంపెనీలను నిర్వహించే వెరిజాన్‌ మీడియాను అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థకు 5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.37,500 కోట్లు)కు వెరిజాన్‌ విక్రయించనుంది. కొత్త కంపెనీ ‘యాహూ’లో 10 శాతాన్ని అట్టేపెట్టి ఉంచుకోనున్నట్లు వెరిజాన్‌ సోమవారం తెలిపింది. ఇంటర్నెట్‌ ప్రారంభ రోజుల్లో ఈ రెండు కంపెనీలూ ఒక వెలుగు వెలిగాయి. అయితే గూగుల్, ఫేస్‌బుక్‌ల రాకతో పోటీని తట్టుకోలేక వెనకబడ్డాయి. ఏఓఎల్‌పై ఆశలతో 2015లో ఆ కంపెనీని వెరిజాన్‌ 4 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అంతకు మించి ఖర్చుతో యాహూను కొనుగోలు చేసి రెండింటినీ విలీనం చేసింది. సోమవారం నాటి ఒప్పందం ప్రకారం.. వెరిజాన్‌కు 4.25 బిలియన్‌ డాలర్ల నగదు, 750 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనారిటీ వాటా దక్కుతుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ఒప్పందం పూర్తి కావొచ్చు. 


మహీంద్రా ప్లాంట్‌ల వార్షిక నిర్వహణ ముందుకు

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్లాంట్‌ల వార్షిక నిర్వహణ మూసివేత పనులను ముందుకు తీసుకొచ్చినట్లు వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. వాస్తవానికి నాలుగు రోజుల పాటు నిర్వహించే వార్షిక నిర్వహణ పనులు జూన్‌లో జరగాల్సి ఉండగా.. కరోనాను దృష్టిలో ఉంచుకుని మేలో పూర్తిచేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగులు, భాగస్వాములు, ఇతర వ్యవస్థల భద్రత, ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు వివరించింది. మహీంద్రా అటోమోటివ్‌ విభాగానికి చకన్, నాసిక్, కండివాలీ, జహీరాబాద్, హరిద్వారాల్లో తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే మారుతీ, హీరో, ఎంజీ మోటార్, హోండా మోటార్‌సైకిల్, సుజుకీ మోటార్‌సైకిల్‌లు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


మోయివింగ్‌తో వెలెక్ట్రిక్‌ జట్టు

దిల్లీ: లాజిస్టిక్స్‌ రంగంలో విద్యుత్‌ వాహనాలను పెంచేందుకు పని చేస్తున్న అంకుర సంస్థ మోయివింగ్‌తో జట్టు కట్టినట్లు విద్యుత్‌ ద్విచక్ర వాహన అంకుర సంస్థ వెలెక్ట్రిక్‌ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం కింద వెలెక్ట్రిక్‌ 1,000 విద్యుత్‌ ద్విచక్రవాహనాలను లీజు పద్ధతిన అందించి మెయింటెనెన్స్‌ మద్దతు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. తొలుత బెంగళూరులో 60 వాహనాలను మోయివింగ్‌కు అందించి, వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అన్ని ప్రధాన నగరాల్లో 1,000కి పైగా ద్విచక్ర వాహనాలను సమకూరుస్తామని వెలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వికాస్‌ జైన్‌ వెల్లడించారు.


భారత్‌లో పరిస్థితి బాధాకరం

భారత్‌లో పరిస్థితులు చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ప్రపంచమంతా ఇపుడు భారత్‌నే గమనిస్తోంది. దేశాలు, కంపెనీలు తమ వనరులతో ఇపుడు దేశానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. యార్సెలర్‌ మిత్తల్‌ కూడా అందుకు కట్టుబడి ఉంది. భారత్‌కు మా కంపెనీ ఆక్సిజన్‌ పంపిస్తోంది. గుజరాత్‌ ప్రభుత్వం భాగస్వామ్యంతో 250 పడకల ఆసుపత్రి తెరచాం. దీనిని 1000 పడకలకు విస్తరిస్తాం. పరిస్థితులన్నిటినీ ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. మాకు చేతనైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. - యార్సెలర్‌ మిత్తల్‌ సీఈఓ ఆదిత్య మిత్తల్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని