close

Published : 05/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5జీ పరీక్షలకు టెల్కోలకు అనుమతి

 జాబితాలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌

దిల్లీ: 5జీ పరీక్షలు నిర్వహించడానికి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ కంపెనీల దరఖాస్తులను టెలికాం విభాగం(డాట్‌) ఆమోదించింది. ఇందులో ఏవీ కూడా చైనా కంపెనీల సాంకేతికతను వినియోగించడం లేదు. డాట్‌ ఆమోదం పొందిన టెలికాం గేర్‌ తయారీ కంపెనీల్లో ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌, రిలయన్స్‌ జియో(సొంత సాంకేతికత)లున్నాయి. ‘గతంలో స్పెక్ట్రమ్‌ వేలం తర్వాతే పరీక్షలు జరిగేవి. ఇపుడు ముందే పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు ఇచ్చాం. దీని వల్ల 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి, నెట్‌వర్క్‌ సేవల ప్రారంభానికి మధ్య కాలాన్ని తగ్గించినట్లవుతుంద’ని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ పేర్కొన్నారు. మరో వైపు, బీఎస్‌ఎన్‌ఎల్‌ విడిగా పరీక్షలు నిర్వహిస్తుందని, దాని దరఖాస్తు త్వరలోనే వస్తుందని ప్రకాశ్‌ తెలిపారు. తొలుత భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు చైనా కంపెనీ హువావే సాంకేతికతను వినియోగించి పరీక్షలు నిర్వహిస్తామంటూ దరఖాస్తు చేశాయి. తర్వాత చైనా కంపెనీల సాయం లేకుండానే వాటిని చేపడతామని దరఖాస్తులు అందజేశాయి.తాజా పరిణామలపై హువావే ఇంకా స్పందించలేదు.
6 నెలల సమయం:  టెల్కోలు 5జీ పరీక్షల కోసం వివిధ స్పెక్ట్రమ్‌ను వినియోగించనున్నాయి. వస్తువుల సమీకరణ, ఏర్పాటు సహా.. 6 నెలల పాటు ఈ పరీక్షలను నిర్వహించుకోడానికి డాట్‌ అనుమతించింది.
4జీ కంటే 10 రెట్ల డౌన్‌లోడ్‌ వేగం: డాట్‌ ప్రకారం.. 4జీతో పోలిస్తే 5జీ సాంకేతికత వల్ల 10 రెట్ల డౌన్‌లోడ్‌ స్పీడ్‌ పెరుగుతుంది. స్పెక్ట్రమ్‌ సామర్థ్యం మూడింతలవుతుంది. 5జీ జీ సాంకేతికత వల్ల ఐఓటీ, పరిశ్రమ 4.0కు చేదోడు లభిస్తుందని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.పి. కొచ్చర్‌ పేర్కొన్నారు. అయితే 5జీ స్పెక్ట్రమ్‌ ధర విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని