close

Published : 05/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలి త్రైమాసిక వృద్ధికి కొవిడ్‌ అడ్డు

 ఆర్థిక వ్యవస్థను కాపాడేది టీకాలే
 నవంబరు కల్లా రోజుకు 60 లక్షల డోసుల ఉత్పత్తి
 యూబీఎస్‌ అంచనాలు

ముంబయి: భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా ఏప్రిల్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఇది తొలి త్రైమాసిక జీడీపీని కొంత మేర దెబ్బతీయవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ అంచనా వేస్తోంది. రియల్‌ టైంలో ఆర్థిక కార్యకలాపాలను లెక్క వేసే ‘యూబీఎస్‌ ఇండియా యాక్టివిటీ ఇండికేటర్‌’ గత నెలలో 7 పర్సంటేజీ పాయింట్లు తగ్గి 95కు చేరింది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న మార్చి 2020లో ఇది 12 శాతం; ఏప్రిల్‌ 2020లో 25.5 శాతం తగ్గింది. అప్పట్లో మొత్తం కేసులు 25,000 కూడా లేవు. ఇపుడు 2 కోట్లను అధిగమించాయి.
2020తో పోలిస్తే ప్రభావం తక్కువే
కాగా, ఈ నెలలో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాల స్థాయి మరింత బలహీనపడవచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. ఇది జూన్‌ త్రైమాసిక వాస్తవ జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందని.. గతేడాదితో పోలిస్తే షరతులు మరీ కఠినంగా లేకపోవడం, అందరూ సరికొత్త జీవనానికి అలవాటు పడడం ఇందుకు కారణాలని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను, జీవితాలను కాపాడేది టీకాలేనని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త తన్వీ గుప్తా అంటున్నారు.
 డిసెంబరు చివరకు 43% జనాభాకు టీకాలు
డిసెంబరు చివరి నాటికి దేశ జనాభాలో 43 శాతం లేదా 18 ఏళ్లు పైబడిన జనాభాలో 64 శాతం మేర టీకాలు వేసే అవకాశం ఉందని గుప్తా అంచనా వేశారు. రోజుకు 25-30 లక్షల మేరే టీకా డోసుల ఉత్పత్తి ఉండడాన్ని గుర్తు చేశారు. మే చివరకు ఇదే స్థాయిలో ఉత్పత్తి ఉండొచ్చని; నవంబరు కల్లా రోజుకు 60 లక్షల డోసులకు ఉత్పత్తి చేరొచ్చని ఆమె అన్నారు.

నాయకత్వ లోపం వల్లే కరోనా సంక్షోభం
రఘురాం రాజన్‌ వ్యాఖ్యలు

కొవిడ్‌ తొలి దశ తర్వాత ఏర్పడ్డ నిర్లక్ష్యం వల్లే దేశంలో ఇపుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయపడ్డారు. ‘నాయకత్వ లోపం దూరదృష్టి లేమి’ వల్ల కూడా దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఒక ఆంగ్ల టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే..‘మనం జాగ్రత్తగా ఉండి ఉంటే, కొవిడ్‌ వ్యాప్తి ఇంకా పూర్తి కాలేదని గుర్తించి ఉండేవాళ్లం. మిగతా ప్రపంచాన్ని (ఉదాహరణకు బ్రెజిల్‌ను) చూసినపుడైనా వైరస్‌ వేర్వేరు రూపాల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకుని ఉండాల్సింది. గతేడాది కొవిడ్‌ కేసులు తగ్గగానే, వైరస్‌ మనకు చేయాల్సిన నష్టమంతా చేసేసిందని భావించాం. ఆ నిర్లక్ష్యం, జాగ్రత్తలు పాటించడంలో అలక్ష్యమే మనల్ని దెబ్బతీసింది. తొలి దశలో సాధించిన విజయం మనల్ని నిర్లిప్తంగా ఉండేలా చేసింది. మన సొంత జనాభాకు తగిన టీకాలను సిద్ధం చేసుకోవడంలో విఫలమయ్యేలా చేసింది. మనకు సమయం ఉందని.. టీకాలు నెమ్మదిగా తీసుకురావొచ్చనీ భావించేలా చేసింది. ఇపుడు ప్రభుత్వం ‘అత్యవసర’ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేయాల్సి వస్తోంది.’ అని రాజన్‌ వివరించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని