ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ఆమోదం
close

Updated : 06/05/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ఆమోదం

దిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య నియంత్రణ బదిలీకి కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి కలిపి 94 శాతానికి పైగా వాటా ఉంది. 49.21 శాతం వాటాతో ఎల్‌ఐసీ ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో యాజమాన్య నియంత్రణ కలిగిన ప్రమోటరుగా ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని బుధవారం ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ ఎంత మేర వాటాలు విక్రయిస్తాయనే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో సంప్రదింపుల తర్వాత నిర్ణయిస్తారని పేర్కొంది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా తగ్గించుకునేందుకు ఎల్‌ఐసీ బోర్డు కూడా ఆమోదం తెలిపిందని తెలిపింది. ఎల్‌ఐసీ, ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ఐడీబీఐ బ్యాంక్‌ వ్యాపార వృద్ధికి అవసరమైన కొత్త సాంకేతికతను, మూలధనాన్ని, ఉత్తమ యాజమాన్య ప్రమాణాలను కొత్త కొనుగోలుదారు తీసుకొస్తారని భావిస్తున్నామని ఆ ప్రకటన పేర్కొంది. కాగా.. ఈ ఏడాది మార్చిలో ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) జాబితా నుంచి కొన్ని షరతులతో ఐడీబీఐ బ్యాంక్‌ బయటపడింది. 2017లో ఈ జాబితాలోకి బ్యాంకును ఆర్‌బీఐ చేర్చింది. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ‘తిరోగమన చర్య’గా ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) ఆక్షేపించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని