వాహన, ఐటీ షేర్లు నడిపించాయ్‌
close

Published : 07/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహన, ఐటీ షేర్లు నడిపించాయ్‌

రెండో రోజూ కొనసాగిన లాభాలు
సమీక్ష

సూచీల జోరు రెండో రోజూ కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, వాహన, ఫైనాన్స్‌, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లపై మేధోసంపత్తి హక్కు  రద్దు చేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం మెప్పించింది. భారత్‌ సహా వర్థమాన దేశాల్లో వ్యాక్సినేషన్‌ జోరందుకోడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మదుపర్లు భావించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు పెరిగి 73.78 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో చైనా మినహా మిగతావన్నీ రాణించాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 48,877.78 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 48,614.11 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకున్న సూచీ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. చివరకు 272.21 పాయింట్ల లాభంతో 48,949.76 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 106.95 పాయింట్లు పెరిగి 14,724.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,611.50- 14,743.90 పాయింట్ల మధ్య కదలాడింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.7,161.91 కోట్ల లాభాలు నమోదుచేయడంతో టాటా స్టీల్‌ షేరు మెరిసింది. ఇంట్రాడేలో 5.59 శాతం పరుగులు తీసిన షేరు.. రూ.1128.80 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.96 శాతం లాభంతో రూ.1100.55 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభాలతో ముగిశాయి. బజాజ్‌ ఆటో అత్యధికంగా 2.61% పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ 2.20%, టెక్‌ మహీంద్రా 1.67%, ఇన్ఫోసిస్‌ 1.46%, మారుతీ 1.12%, టైటన్‌ 1.11%, నెస్లే 1.07%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1% చొప్పున లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 1.24%, ఓఎన్‌జీసీ 0.86%, ఎన్‌టీపీసీ 0.82%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.73% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, వాహన, ఐటీ 2.74% శాతం మేర పెరిగాయి. బీఎస్‌ఈలో 1622 షేర్లు లాభపడగా, 1371 స్క్రిప్‌లు నష్టపోయాయి.

అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌ కంపెనీల షేర్లు పడ్డాయ్‌
ప్రపంచ దేశాలకు టీకాలను సులభతరంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లపై మేధోసంపత్తి హక్కులను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా మద్దతు ప్రకటించడంతో వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల షేర్లు నీరసపడ్డాయి. గురువారం అమెరికా మార్కెట్‌లో ఫైజర్‌, బయోఎన్‌టెక్‌, నోవావాక్స్‌, క్యూర్‌వ్యాక్‌ ఎన్‌వీ షేర్లు నష్టపోయాయి. అంతకు ముందు హాంకాంగ్‌ ఎక్స్ఛేంజీల్లో బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను చైనాలో విక్రయించే షాంఘై ఫోసన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ షేరు ఏకంగా 14 శాతం కుదేలైంది. చైనా దేశీయ వ్యాక్సిన్‌లను తయారుచేసే క్యాన్‌సినో బయోలాజిక్స్‌ 15%, వాల్వాక్స్‌ బయోటెక్నాలజీ 11%, ఛాంగ్‌క్విన్‌ జిఫీ బయోలాజికల్‌ 8.7% చొప్పున నష్టాలు నమోదు చేశాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని