రూ.46,000 ఔషధాన్ని రూ.420కే ఇస్తాం
close

Published : 07/05/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.46,000 ఔషధాన్ని రూ.420కే ఇస్తాం

‘బారిసిటినిబ్‌’ కంపల్సరీ లైసెన్స్‌ కోసం నాట్కో దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశంలో ‘బారిసిటినిబ్‌’ ఔషధానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) సంపాదించిన నాట్కో ఫార్మా, ఇదే ఔషధానికి ‘కంపల్సరీ లైసెన్సింగ్‌’ కోసం కంట్రోలర్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, ముంబయి కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేసింది. కొవిడ్‌-19 ముప్పు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని ఎంతో తక్కువ ధరకు బాధితులకు అందించడానికి వీలుగా పేటెంట్స్‌ చట్టంలోని సెక్షన్‌ 92(1), 92(3) కింద ‘కంపల్సరీ లైసెన్స్‌’ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రజారోగ్యం ప్రమాదంలో పడినప్పుడు ఏదైనా మందుకు ఇటువంటి లైసెన్స్‌ ఇచ్చే అధికారం సెక్షన్‌ 92 కింద పేటెంట్స్‌ కంట్రోలర్‌కు ఉంటుంది. కొవిడ్‌-19 వ్యాధి తీవ్రమై ఆస్పత్రుల పాలైన బాధితుల్లో కనిపించే ‘సైటోకైన్‌ స్ట్రామ్‌’ ముప్పును ఎదుర్కోవడంలో ‘బారిసిటినిబ్‌’ ఔషధం క్రియాశీలకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనిపై మనదేశంలో ఎలి లిల్లీ అనే బహుళ జాతి ఫార్మా కంపెనీకి పేటెంట్‌ ఉంది. కొవిడ్‌-19 బాధితులకు ఈ ట్యాబ్లెట్‌ను రోజుకు రెండు చొప్పున ఏడు రోజుల పాటు... మొత్తం 14 ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలి లిల్లీ మనదేశంలో ఒక్కో ట్యాబ్లెట్‌ను సుమారు రూ.3,300 ధరకు విక్రయిస్తోంది. ఒక్కో రోగి దీని ప్రకారం దాదాపు రూ.46,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. బదులుగా ఒక్కో ట్యాబ్లెట్‌ను నాట్కో ఫార్మా రూ.30 ధరకే అందించడానికి ముందుకు వచ్చింది. అంటే రూ.420కే పూర్తి డోసేజీ లభిస్తుంది. ఈ మందు తయారు చేయడానికి వీలుగా ‘వాలంటరీ లైసెన్స్‌’ ఇవ్వాలని, బదులుగా లాభాల్లో 7 శాతం రాయల్టీ చెల్లిస్తానని ఎలి లిల్లీని గత ఏడాది డిసెంబరులో కోరినా ఈ సంస్థ స్పందించలేదని నాట్కో ఫార్మా పేర్కొంది. అందువల్ల తనకు ‘కంపల్సరీ లైసెన్స్‌’ ఇవ్వాలని పేటెంట్‌ దరఖాస్తులో కోరిందని సమాచారం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని