9 నుంచి సరకు రవాణా విమానాలు
close

Published : 07/05/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9 నుంచి సరకు రవాణా విమానాలు

సెచ్‌వాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంసిద్ధత
ఫార్మాగ్జిల్‌ చొరవతో సమస్య పరిష్కారం
ఔషధ ముడిపదార్ధాల కొరత తీరే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: చైనాలోని సెచ్‌వాన్‌ ఎయిర్‌లైన్స్‌ మనదేశానికి సరకు రవాణా విమాన సర్వీసులు పునరుద్ధరించడానికి ముందుకు వచ్చినట్లు ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ వెల్లడించారు. కొంతకాలంగా మనదేశానికి సరకు రవాణా విమాన సర్వీసులను సెచ్‌వాన్‌ నిలిపివేసింది. ఫలితంగా చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు కావాల్సిన ముడిపదార్థాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్్స), ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య ఉపకరణాల దిగుమతులు సాధ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉత్పన్నం అయింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఉదయ భాస్కర్‌, చైనాలోని భారత రాయబారి విక్రమ్‌ మిశ్రికి లేఖ రాశారు. తత్ఫలితంగా జరిగిన సంప్రదింపులు ఫలించి, మళ్లీ సరకు రవాణా సేవలు ప్రారంభించడానికి సెచ్‌వాన్‌ ఎయిర్‌లైన్స్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు సమాచారం అందింది. సెచ్‌వాన్‌ ఎయిర్‌లైన్స్‌ చైనాలోని ఛెంగ్డు నుంచి బెంగళూరుకు ఈ నెల 9 నుంచి, ఛెంగ్డు నుంచి చెన్నైకి ఈ నెల 12న సరకు రవాణా విమానాలు ప్రారంభిస్తుంది. ఇవేకాక చైనా నుంచి సరకు రవాణా కోసం ఛార్టర్డ్‌ విమాన సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య మళ్లీ సరకు రవాణా మొదలవుతుందని, ఔషధ కంపెనీలకు ముడిపదార్థాల కొరత తీరుతుందని ఉదయ భాస్కర్‌ వివరించారు. ఇటీవల కాలంలో పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, ఐవర్‌మెక్టిన్‌, డాక్సీసైక్లిన్‌, ఇంకా పలు రకాల విటమిన్‌ ట్యాబ్లెట్లకు అనూహ్య గిరాకీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఔషధాలను కొవిడ్‌-19  రోగులకు వినియోగిస్తున్నారు. ఫార్మాగ్జిల్‌ సకాలంలో స్పందించి చైనా- భారతదేశాల మధ్య సరకు రవాణా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని