పన్ను ఆదాకు.. పాలసీ వద్దు..
close

Updated : 07/05/2021 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్ను ఆదాకు.. పాలసీ వద్దు..

మూడు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈపీఎఫ్‌ నుంచి రూ.11లక్షల వరకూ వస్తాయి. ఈ మొత్తాన్ని మంచి రాబడి వచ్చేలా మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 10 ఏళ్ల వరకైనా పెట్టుబడిని కొనసాగిస్తాను. దీనికోసం నేను ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి? - రాణి

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 8.5శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. దీనిపై ఎలాంటి పన్నూ ఉండదు. మీరు భవిష్యత్తులో తిరిగి ఉద్యోగంలో చేరే ఆలోచన ఉంటే ఇందులో నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవద్దు. ప్రస్తుతమున్న అన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో ఈపీఎఫ్‌ అధిక వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు మీరు డబ్బు వెనక్కి తీసుకుంటే.. ఒకేసారి ఇంత మొత్తం ఒకేసారి జమ చేయడం సాధ్యం కాదు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌ ద్వారానే తిరిగి నిధిని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగం చేసే ఆలోచన లేకపోతే.. ఈ డబ్బులు తీసుకోండి. ఈ మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. 10 ఏళ్ల సమయం ఉంది అంటున్నారు కాబట్టి, కనీసం 13శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.37,34,000 అయ్యేందుకు అవకాశం ఉంది.

ఆరోగ్య బీమా పాలసీని నాలుగేళ్లుగా కొనసాగిస్తున్నాను. నాకు ఇటీవలే వివాహం అయ్యింది. నా భార్య పేరుతో ఎలాంటి పాలసీలు లేవు. ఇప్పుడు తనను నా పాలసీలో చేర్పించి, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని తీసుకోవాలా? లేకపోతే తనకు వేరే పాలసీని తీసుకోవాలా? - రాము

మీరు విడివిడిగా పాలసీలు తీసుకుంటే ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. కొత్త పాలసీ తీసుకోవడం కన్నా.. మీ భార్య పేరును మీ పాలసీలో చేర్చి, ఇప్పటికే ఉన్న వ్యక్తిగత పాలసీని ఫ్యామిలీ ఫ్లోటర్‌గా మార్చుకోండి. నాలుగేళ్ల క్రితం తీసుకున్నారు.. కాబట్టి, ఇప్పుడున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, పాలసీ విలువను పెంచుకోవడం మంచిది.

పన్ను ఆదా కోసం జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? ప్రత్యామ్నాయంగా ఇతర పథకాలు ఏమున్నాయి? - రమణ

జీవిత బీమా పాలసీని ఎప్పుడూ ఆర్థికంగా అండగా ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ, పన్ను ఆదా కోసం పాలసీ తీసుకోవడం ఎప్పుడూ సరికాదు. పన్ను మినహాయింపు కోసం మదుపు చేయాలనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించండి. వీటిలో మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. కనీసం అయిదేళ్లు కొనసాగిస్తే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.

నాకు రూ.35 లక్షల టర్మ్‌ పాలసీ ఉంది. దీన్ని కొనసాగిస్తూనే మరో కొత్త పాలసీని తీసుకోవాలనుకుంటున్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్‌ పాలసీలు మంచివేనా? - రమేశ్‌

మీ కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా కల్పించాలంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్లు ఉండేలా జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, మీకు ఇంకా ఎంత మొత్తం బీమా అవసరమో పరిశీలించండి. సాధారణ టర్మ్‌ పాలసీలతో పోలిస్తే.. ప్రీమియం వెనక్కిచ్చే టర్మ్‌ పాలసీలకు ప్రీమియం అధికంగా ఉంటుంది. మీరు సాధారణ టర్మ్‌ పాలసీని తీసుకోండి. మీ దగ్గర ఉన్న మిగులు మొత్తాన్ని మంచి రాబడినిచ్చే పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. - తుమ్మ బాల్‌రాజ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని