రష్యానుంచి మరో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్‌ వి
close

Published : 08/05/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యానుంచి మరో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్‌ వి

రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌ చేరుకునే అవకాశం  
నెలాఖరు నాటికి మరికొన్ని డోసులు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా టీకా అయిన ‘స్పుత్నిక్‌ వి’ లభ్యత దేశీయంగా పెరగనుంది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ సంస్థ, రష్యా నుంచి రెండో విడతగా 1.5 లక్షల డోసుల టీకా పంపించనికి సన్నాహాలు చేస్తోంది. ఈ టీకా రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌ రానున్నట్లు, దాన్ని పంపిణీ చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చర్యలు తీసుకుంటున్నట్లు   తెలుస్తోంది. తొలి విడతగా 1.5 లక్షల డోసులు ‘స్పుత్నిక్‌ వి’ టీకా రష్యా నుంచి ఈ నెల 1న హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో విడత టీకా డోసులు రాబోతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల డోసుల టీకా రష్యా నుంచి మనదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీకాకు ప్రస్తుతం మనదేశంలో తీవ్రమైన కొరత ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక డోసు టీకా తీసుకున్న వారికి రెండో డోసు టీకా సైతం లభ్యం కావడం లేదు. కొత్తగా టీకా కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎంతో అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్‌ వి టీకాను అధికంగా ఉత్పత్తి చేసి, మనదేశానికి పంపాలని స్పుత్నిక్‌ వి టీకాను అభివృద్ధి చేసిన రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2 డోసుల్లోనే
‘స్పుత్నిక్‌ వి’ రెండు డోసుల టీకా. మొదటి డోసు ఇచ్చిన తర్వాత 21 రోజులకు రెండో డోసు ఇవ్వాలి. దీన్ని మనదేశంలో పంపిణీ చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌,  రష్యా సంస్థ అయిన ఆర్‌డీఐఎఫ్‌తో గత ఏడాదిలో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆర్‌డీఐఎఫ్‌, మనదేశంలో పంపిణీ చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు 25 కోట్ల డోసుల టీకా అందిస్తుంది. ఇందులో దాదాపు 70 శాతం టీకా నేరుగా రష్యా నుంచి దిగుమతి అవుతుంది. మిగిలిన 30 శాతం టీకాను మనదేశంలో వివిధ ఫార్మా కంపెనీల వద్ద ఉత్పత్తి చేయించి, దాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌కు సరఫరా చేస్తుంది. మనదేశంలో స్పుత్నిక్‌ వి టీకా తయారు చేయడం కోసం గ్లాండ్‌ ఫార్మా, విర్కో బయోటెక్‌, హెటెరో,  బయోఫార్మా... తదితర కంపెనీలతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  
చైనా సినోఫామ్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి
జెనీవా: చైనా కంపెనీ సినోఫామ్‌ తయారుచేస్తున్న కొవిడ్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ఆధ్వర్యంలో పేద దేశాల్లో జరుగుతున్న టీకా కార్యక్రమానికి లక్షల కొద్దీ డోసులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. యూఎన్‌కు చెందిన యునిసెఫ్‌, డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన అమెరికా ప్రాంతీయ కార్యాలయం ద్వారా రాబోయే వారాల్లో, నెలల్లో ‘కొవాక్స్‌’ పథకం కింద ఈ టీకాల పంపిణీ జరుగుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని