సమర్థంగా వ్యాక్సిన్ల వాయు రవాణా
close

Published : 08/05/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమర్థంగా వ్యాక్సిన్ల వాయు రవాణా

ఇప్పటివరకు 100 టన్నుల పంపిణీలో జీఎంఆర్‌ ఎయిర్‌కార్గో కీలకపాత్ర

ఈనాడు, హైదరాబాద్‌ : కరోనాపై ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరులో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కీలకపాత్ర పోషిస్తోంది. నగరానికి చెందిన ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లను ఎగుమతి చేయడంతో పాటు వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్లు, ముడిసరుకు దిగుమతుల్లో ప్రధాన భూమిక వహిస్తోంది. వీటి రవాణాకు అవసరమైన ఉష్ణోగ్రతల వ్యవస్థలు తెగిపోకుండా నిర్వహిస్తోంది. ఇక్కడ తయారైన కొవిడ్‌ వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకు 100 టన్నులకుపైగా కొవిడ్‌ వ్యాక్సిన్లను హైదరాబాద్‌ నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు పంపిణీ చేయడంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో (జీహెచ్‌ఏసీ) చురుగ్గా వ్యవహరించింది. దేశీయంగా 58 ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 150 స్థానాలకు ఇక్కడ నుంచి రవాణా అవుతున్నాయి.

ఉష్ణోగ్రతల నిర్వహణలో కీలకం
కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులు, దిగుమతులకు కావాల్సిన సదుపాయాలను గతేడాది సెప్టెంబరులో జీహెచ్‌ఏసీ అధికారులు సమకూర్చుకున్నారు. ఎప్పటికప్పుడు సౌకర్యాలు మెరుగుపర్చుకుంటూ వ్యాక్సిన్ల రవాణాలో సహకారం అందిస్తున్నారు. వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటివీ రవాణా చేస్తున్నారు. ఈ నెల 1న రష్యా నుంచి వచ్చిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లను సమర్థంగా జీహెచ్‌ఏసీ రవాణా చేయగలిగింది. ఈ వ్యాక్సిన్లు -20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ ఉంచాలి. ఈ సదుపాయాలు ఉండటంతో సులువుగా వ్యాక్సిన్లను గమ్యస్థానాలకు చేరవేయగలిగారు. ఇక్కడ 15-25 డిగ్రీలు, 2-8 డిగ్రీలు, -20 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల వ్యవస్థలను నిర్వహిస్తున్నారు. ఫార్మాజోన్‌లో ఉష్ణోగ్రత, తేమ, సెన్సర్‌ అలారం హెచ్చరికలతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. సరకుల నిల్వలో డాటా లాగర్‌తో ఉష్ణోగ్రత రికార్డింగ్‌ చేస్తారు.

భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు..

రానున్న 18-24 నెలల్లో హైదరాబాద్‌ కేంద్రంగా 360 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. వీటిని ఇతర రాష్ట్రాలతో పాటు పలు దేశాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని రకాలుగా సమాయత్తమైనట్లు కార్గో అధికారులు చెబుతున్నారు. ఫార్మా సరకులను దిగుమతి చేసేప్పుడు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు తగ్గించేందుకు, ఫార్మాజోన్‌లో భాగంగా కోల్డ్‌ సూపర్‌స్టోర్‌ ఏర్పాటు చేస్తున్నారు. విమానం వరకు ఒకే ఉష్ణోగ్రతలో తరలించేందుకు జీహెచ్‌ఏసీ మొబైల్‌ రిఫ్రిజిరేటెడ్‌ యూనిట్‌ కూల్‌డాలీని ఉపయోగించుకుంటోంది. వ్యాక్సిన్లు ఎక్కడివరకు చేరాయో ట్రాక్‌ చేయడం, రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ కోసం వ్యాక్సిన్‌ లెడ్జర్‌ బ్లాక్‌ చైన్‌ సొల్యూషన్‌ను ఉపయోగించుకుంటోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని