ఆక్సిజన్‌ తయారీలో ఎంఈఐఎల్‌
close

Published : 09/05/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ తయారీలో ఎంఈఐఎల్‌

తెలుగు రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా
సొంతంగా తయారీ ప్లాంట్ల ఏర్పాటు
డీఆర్‌డీఓ, ఐటీసీ భద్రాచలంతో ఒప్పందాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని కొవిడ్‌-19 బాధితులకు అండగా నిలిచే లక్ష్యంతో ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ఎంఈఐఎల్‌ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ కోసం ఐటీసీ భద్రాచలం, హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓతో సహకార ఒప్పందాలు చేసుకుంది. డీఆర్‌డీఓ నుంచి ఆక్సిజన్‌ తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధ విమానాల్లో అప్పటికప్పుడు ఆక్సిజన్‌ (ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్‌ జనరేషన్‌) తయారు చేసుకోవటానికి వినియోగిస్తారు. దీంతో రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే కాకుండా ఐటీసీ భద్రాచలం నుంచి రోజుకు 30 మెట్రిక్‌ టన్నుల క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ను తీసుకొని దాన్ని లిక్విడ్‌ ఆక్సిజన్‌గా మార్చుతుంది. ఇప్పటికే ఐటీసీ భద్రాచలం సమీపంలోనే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నెల 15 నుంచి ఈ ప్లాంటులో ఆక్సిజన్‌ తయారు చేస్తారు.  తొలి దశలో రోజుకు 600 ఆక్సిజన్‌ సిలండర్లు సరఫరా చేయటానికి ఎంఈఐఎల్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో సిలిండర్‌లో 7,000 లీటర్ల ఆక్సిజన్‌ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని ఆస్పత్రుల నుంచి తమ ఆక్సిజన్‌ ట్యాంకర్లు నింపాల్సిందిగా ఎంఈఐఎల్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. వీటికి ఈ సంస్థ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీని ప్రకారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు 50 సిలిండర్లు, సరోజినీదేవి నేత్ర వైద్యశాలకు 200, అపోలో హాస్పిటల్స్‌కు 100, కేర్‌ హైటెక్‌ సిటీ హాస్పిటల్‌కు 50 చొప్పున సిలిండర్లు సరఫరా చేయాల్సి వస్తుంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగే కొద్దీ సిలండర్ల సరఫరా పెంచనున్నట్లు, ఇతర ఆస్పత్రులకు అందించనున్నట్లు ఎంఈఐఎల్‌ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్పత్రులకూ ఆక్సిజన్‌ అందిస్తామని పేర్కొన్నాయి.

స్పెయిన్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకులు..
ఆక్సిజన్‌ అవసరాలు మరింతగా పెరిగితే స్పెయిన్‌ నుంచి ఒక్కొక్కటీ 20 టన్నుల సామర్థ్యం కల రెండు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను దిగుమతి చేసుకునేందుకు కూడా ఎంఈఐఎల్‌ ఆలోచన చేస్తోంది.  ఇంకా అవసరం అయితే ఒక్కొక్కటీ 20 టన్నుల సామర్థ్యమున్న 20- 30 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను స్ధానికంగా తయారు చేయటానికి కూడా తాము సిద్ధమని ఈ సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని