అంకురాలకు కష్టకాలం
close

Published : 09/05/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకురాలకు కష్టకాలం

కరోనా పరిణామాలతో రాబడిపై ప్రభావం
చిన్న సంస్థలకు పెట్టుబడులు రావట్లేదు

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ అంకురాలకు కొవిడ్‌-19 రెండో దశ చుక్కలు చూపిస్తోంది. దేశీయంగా కొన్ని సంస్థలు బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరినా.. చిన్న అంకురాలు, రెండేళ్ల క్రితమే అడుగులు వేసిన సంస్థలూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సేవల రంగంలో ఉన్న వాటికి రాబడులు తగ్గిపోవడంతోపాటు, పెట్టుబడులూ అందని పరిస్థితి. దీంతో వ్యవస్థాపకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏడాది క్రితం కరోనా విజృంభించినప్పుడు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులందరికీ ఇంటి నుంచి పని ప్రారంభం అయ్యింది. తక్కువ ఉద్యోగులతో ఉండే అంకురాలూ ఈ విధానాన్నే అనుసరించాయి. ఈ ఏడాది జనవరి నుంచి కొంతమంది సిబ్బందితోనైనా నేరుగా కార్యాలయాలకు వచ్చి పనిచేసే ప్రయత్నం ప్రారంభమైంది. కానీ, మహమ్మారి విరుచుకుపడడంతో ఇప్పుడందరూ మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

ప్రాజెక్టులు ఆలస్యం..
‘మా సంస్థలో నాతో పాటు సగానికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులకూ, తల్లిదండ్రులకూ కరోనా సోకింది. దీంతో ఉద్యోగుల్లో సగానికిపైగా సెలవులోనే ఉంటున్నారు. దీంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నాం. క్లయింట్లు అర్థం చేసుకుంటున్నా.. ఈ ఆలస్యం ప్రభావం మా మీద తప్పకుండా ఉంటుంది’ అని హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్‌ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. మరో వైపు గత ఏడాది కాలంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల కార్యాలయ స్థలం అద్దె చెల్లించాల్సిన అవసరం తగ్గినప్పటికీ.. ఒక చోట కూర్చుని, అందరూ మాట్లాడుకుంటూ.. ఆలోచనలను పంచుకుంటూ.. సంస్థను మరింత వృద్ధి చేసే సువర్ణావకాశాన్ని కోల్పోతున్నామని మరో అంకుర సంస్థ సీఈఓ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాత్కాలికంగా మూసివేత..
సేవల రంగంలోనూ, ప్రత్యక్షంగా వినియోగదారులతో సంబంధం ఉన్న కొన్ని అంకురాలకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా భయంతో వీరి సేవలను పొందేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయాలకు రాకపోవడం, విద్యార్థులూ ఇళ్లకే పరిమితం కావడంతో హాస్టళ్లను వెతికి పెట్టే సంస్థలూ, ఆహార స్టార్టప్‌లకు కష్టమవుతోంది. దీంతోపాటు కార్యాలయాల నుంచి సేవలను అందించే సంస్థలకు ఉద్యోగులు రాకపోవడం సమస్య అవుతోంది. ‘మేము అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అయినప్పటికీ మా ఉద్యోగుల్లో సగానికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూసేయాల్సి వస్తోంది. మళ్లీ ప్రారంభించినా.. భయంతో ఎవరూ రావడం లేదు’ అని ఒక ఫుడ్‌ స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగాల కోత..
కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, రాబడి తగ్గడం, పెట్టుబడులు లభించకపోవడంతో అంకురాలు తమ ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆలోచన దశలోనే ఉన్న సంస్థలు తమ దగ్గరున్న నలుగురైదుగురు ఉద్యోగులనూ భరించే స్థితిలో లేవు. ఇప్పటికే కొంత వృద్ధి చెందిన సంస్థల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా ఉద్యోగులను తీసుకునేందుకూ సిద్ధంగా లేవు. ఈ సంస్థల్లో చేరేందుకు ముందుకొచ్చేవారి సంఖ్యా బాగా తగ్గిందని ఒక అంకుర సంస్థ సహ వ్యవస్థాపకుడు తెలిపారు.

పెట్టుబడిదారులు దూరం..
సాధారణంగా అంకురాలు 6 నెలలు లేదా 10 నెలల కాలానికి సరిపడా నిధులతోనే పనిచేస్తుంటాయి. రాబడి వస్తుంటేనే బండి ముందుకు సాగుతుంది. పెట్టుబడిదారులు సహాయం చేస్తే తప్ప చాలా సంస్థలు ముందుకు కొనసాగలేవు. గత ఏడాదిలో కొన్ని నెలలపాటు అంకురాలు పెట్టుబడులు దొరక్క అల్లాడాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కొన్నింటికి నిధులు అందాయి. మార్చి నుంచి కొవిడ్‌-19 కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభం కావడంతో కొత్తగా పెట్టుబడులు ఇచ్చేవారు కరవయ్యారు. ఆరు నెలల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాలే రద్దవుతున్నాయి. పదిలో రెండు మూడు భాగస్వామ్యాలే అమల్లోకి వస్తున్నాయి. వెంచర్‌ క్యాపటలిస్టులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. అదే సమయంలో కొవిడ్‌-19 సంబంధిత సేవలను అందిస్తున్న, డిజిటల్‌ అంకురాలకు ఎంతో కొంత నిధులు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభుత్వం అంకురాలకు కొన్ని ప్రత్యేక ఇన్సెంటివ్‌లనూ ప్రకటించడం కొంత మేలు చేస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని