ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్లకు మారుతీ సహకారం
close

Published : 10/05/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్లకు మారుతీ సహకారం

ఎయిరోక్స్‌ నైజెన్‌ ఎక్విప్‌మెంట్స్‌, శామ్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్స్‌తో జట్టు

దిల్లీ: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి, రవాణా సమస్యల్ని తొలగించడానికి వీలుగా వాహన దిగ్గజం మారుతీ సుజుకీ.. ఎయిరోక్స్‌ నైజెన్‌ ఎక్విప్‌మెంట్స్‌, శామ్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్స్‌ అనే పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్ల కంపెనీలతో చేతులు కలిపింది. ఆ సంస్థలు ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్లను తయారు చేస్తుంటాయి. వీటి ఉత్పత్తి పెంచేందుకు మారుతీ సహాయం చేయనుంది. ఈ రెండు కంపెనీలు చిన్న తరహావి కావడంతో తయారీని పెంచలేకపోతున్నాయని, నెలకు 5-8 ప్లాంట్లనే ఉత్పత్తి చేయగలుగుతున్నాయని మారుతీ వెల్లడించింది. అందుకే తమ వనరుల్ని ఉపయోగించి ఆ రెండు సంస్థలు ప్లాంట్ల ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటామని మారుతీ వెల్లడించింది. సాంకేతికత, నాణ్యత, ప్రదర్శన, వాణిజ్య అంశాలు ఆ రెండు కంపెనీలే చూసుకుంటాయని, మారుతీ, దాని విక్రేతలు ఆ సంస్థల ఉత్పత్తి పెంచేందుకు తోడ్పాటు అందిస్తాయని, ఇది ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నామని వివరించింది. ఎయిరోక్స్‌ ఇప్పటివరకు రోజుకు ఒక ప్లాంట్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, ఈ నెలలో మేము అందించిన సహకారంతో 4 ప్లాంట్ల వరకు ఉత్పత్తి చేస్తోందని, నెల మొత్తం మీద 50-60 ప్లాంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని మారుతీ తెలిపింది. తమ విక్రేత ఎస్‌కేహెచ్‌ మెటల్స్‌ ఈ కంపెనీతో కలిసి పని చేస్తోందని పేర్కొంది. శామ్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్స్‌తో మరో విక్రేత జేబీఎం కలిసి పని చేస్తోందని ఈ కంపెనీ కూడా ఈ నెలలో 20-30 ప్లాంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వివరించింది. ఈ రెండు కంపెనీల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను కొనుగోలు చేసి వైద్య అవసరాల కోసం మారుతీ అందివ్వనుంది. ప్లాంట్ల తయారీ పూర్తవగానే వాటిని వెంటనే అవసరమైన చోటకు తరలించి, ఇన్‌స్టాల్‌ చేయించి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేపట్టేలా కంపెనీలోని ఒక బృందం పని చేస్తోందని మారుతీ వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని