భారత వృద్ధి 9.3 శాతమే
close

Published : 12/05/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత వృద్ధి 9.3 శాతమే

జీడీపీ అంచనాల్లో మూడీస్‌ కోత

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 9.3 శాతానికి కోత వేస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. అంతక్రితం ఇదే సంస్థ 13.7 శాతంగా అంచనా వేసింది. కరోనా మలి దశ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి, టీకా కార్యక్రమం నేరుగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించగలదని అంటోంది. ఈ నేపథ్యంలో మూడీస్‌ ఏమందంటే..
ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఏప్రిల్‌-జూన్‌కే పరిమితం కావొచ్చు. ద్వితీయార్ధంలో బలమైన రికవరీ కనిపించొచ్చు.
కరోనా మలి దశ కారణంగా మేం జీడీపీ వృద్ధి రేటును 13.7% నుంచి 9.3 శాతానికి తగ్గించి తర్వాతి సంవత్సర అంచనాలను 6.2% నుంచి 7.9 శాతానికి పెంచాం.
దీర్ఘకాలంలో వృద్ధి రేటు 6 శాతం దరిదాపుల్లో ఉండొచ్చు.
ఆర్థిక వృద్ధికి ఉన్న అవాంతరాలు, అధిక రుణాలు, బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా సార్వభౌమ రుణ రేటింగ్‌పై ప్రభావం పడొచ్చు.
మరోసారి వైరస్‌ విజృంభిస్తుండడంతో ఆదాయాలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ వైపు ప్రభుత్వ వ్యయాలు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు 11.8 శాతానికి పెరగవచ్చు.
అటు వృద్ధి మందగమనం, ఇటు ద్రవ్యలోటు పెరుగుదల కారణంగా ప్రభుత్వ రుణాలు ఈ ఏడాది(2021-22) జీడీపీలో 90 శాతానికి చేరొచ్చు. 2022-23లో అవి 92 శాతానికీ పెరగవచ్చు.

2021-22లో 10.8 శాతమే
అంచనాలను సవరించిన నొమురా

ముంబయి: భారత వృద్ధి అంచనాలకు జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నొమురా కోత వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత వృద్ధి 10.8 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. రెండో దశ కరోనా నేపథ్యంలో విధిస్తున్న లాక్‌డౌన్‌లు ఇందుకు కారణమని తెలిపింది. అంతక్రితం అంచనా 12.6 శాతంగా ఉంది. నొమురా ఏమంటోందంటే..
మే 9తో ముగిసిన వారంలో కార్యకలాపాలు కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే 64.5 శాతానికి తగ్గాయి.
భారీ స్థాయిలో లాక్‌డౌన్‌ల కారణంగా జూన్‌ త్రైమాసికంపై ప్రభావం పడుతుందన్న అంచనాల మధ్య జీడీపీలో కోత విధించాం.
టీకా లభ్యత, అంతర్జాతీయ రికవరీ, సులభతర ఆర్థిక పరిస్థితుల విషయంలో మధ్యకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వసిస్తున్నాం. ఏప్రిల్‌-జూన్‌లో స్థానికంగా కార్యకలాపాలు డీలా పడనున్నాయి.
భారత వృద్ధి 10.1 శాతం..ఐరాస: 2022లో భారత్‌ 10.1 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి సాధించిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతుందనిపేర్కొంది. అయితే 2021లో మాత్రం అంచనాలు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయని.. కరోనా మలిదశ తీవ్రతే ఇందుకు కారణమని అంటోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని