కొవాగ్జిన్‌ 7.8 కోట్లు.. కొవిషీల్డ్ 10 కోట్లు
close

Published : 13/05/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌ 7.8 కోట్లు.. కొవిషీల్డ్ 10 కోట్లు

ఆగస్టు కల్లా తయారీకి సిద్ధమన్న భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌
దిల్లీ

కొవిడ్‌-19 టీకా తగినంతగా అందుబాటులో లేదని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచడంపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు దృష్టి సారించాయి. వచ్చే నాలుగు నెలల కాలానికి తమ ఉత్పత్తి ప్రణాళికను ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. దీని ప్రకారం ఆగస్టు నాటికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 10 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకా తయారు చేస్తుంది. అదేవిధంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ 7.8 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారు చేయడానికి సిద్ధమవుతుంది. జులైలో 3.32 కోట్ల డోసులటీకా ఉత్పత్తి చేస్తామని, ఆగస్టు నాటికి దాన్ని 7.82 కోట్లకు పెంచుతామని భారత్‌ బయోటెక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.కృష్ణ మోహన్‌ ప్రభుత్వానికి నివేదించారు. సెప్టెంబరులోనూ అదే స్థాయి ఉత్పత్తి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి 10 కోట్ల డోసుల ‘కొవిషీల్డ్‌’ టీకా తయారు చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. టీకా ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, దీనివల్ల జూన్‌, జులై నెలల్లో ఉత్పత్తి కొంత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్స్‌ సంయుక్త కార్యదర్శి రజనీష్‌ టింగల్‌, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ మందీప్‌ భండారీ తదితరులతో కూడిన మంత్రివర్గ సంఘం ఈ ఏడాది ఏప్రిల్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ టీకా తయారీ యూనిట్లను సందర్శించింది కూడా.  ఇప్పుడు దేశీయంగా అవసరాలకు తగినట్లు కొవిడ్‌ టీకా  లభించకపోవడంతో దిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా తదితర రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించడం తెలిసిందే. తమకు అదనపు డోసుల టీకా కావాలని దిల్లీ ప్రభుత్వం భారత్‌ బయోటెక్‌ను కోరింది. ముందు చెప్పినదానికి మించి ఇప్పుడు సరఫరా చేయలేమని కంపెనీ స్పష్టం చేసినట్లు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా తెలిపారు. టీకాల ఎగుమతిని నిలుపుదల చేయాలని, దేశీయంగా ఉత్పత్తి పెంచి సరఫరాలు పెంచాలని మనీష్‌ కోరారు.

18 రాష్ట్రాలకు కొవాగ్జిన్‌: కొవాగ్జిన్‌ టీకా సరఫరా విషయంలో తమపై కొన్ని రాష్ట్రాలు విమర్శలు చేయడం విచారకరమని భారత్‌ బయోటెక్‌  పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకాలను ఈ నెల 10న 18 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు కంపెనీ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల ఒక ‘ట్వీట్‌’ లో పేర్కొన్నారు. ‘‘కొన్ని డోసుల టీకాలను 18 రాష్ట్రాలకు పంపించాం. కానీ కొన్ని రాష్ట్రాలు మాపై ఫిర్యాదులు చేస్తున్నాయి. మా ఉద్యోగుల్లో 50 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా టీకా తయారీకి 24 గంటలు పనిచేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

‘బారిసిటినిబ్‌’ తయారీకి  ఎలి లిల్లీతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్‌: మనదేశంలో ‘బారిసిటినిబ్‌’ ఔషధాన్ని తయారు చేసి విక్రయించడానికి ఎలి లిల్లీతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ‘వాలంటరీ లైసెన్సింగ్‌’ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మందు కాగా, దీన్ని కొవిడ్‌-19 బాధితులు త్వరగా కోలుకోడానికి వీలుగా ‘రెమ్‌డెసివిర్‌’ తో కలిసి ఇచ్చేందుకు మనదేశంలో సీడీఎస్‌సీఓ (సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) ‘అత్యవసర అనుమతి’ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలి లిల్లీ ఇప్పటికే మనదేశానికి చెందిన మూడు ఫార్మా కంపెనీలతో వాలంటరీ లైసెన్సింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇదే కోవలో ఇప్పుడు డాక్టర్‌ రెడ్డీస్‌తోనూ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని