ఫంగస్‌ అదుపుచేసే ఔషదాల కొరత
close

Published : 13/05/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫంగస్‌ అదుపుచేసే ఔషదాల కొరత

ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వ సూచనలు
సానుకూలంగా స్పందిస్తున్న ఫార్మా కంపెనీలు

యాంఫోటెరిసిన్‌ బి 50 ఎంజీ ఇంజెక్షన్‌.. ఫంగస్‌ను అదుపు చేసేందుకు వినియోగించే ఔషధం ఇది. దీన్ని దేశీయ ఫార్మా కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. స్థానికంగా కొన్ని ఫార్మా కంపెనీలు సైతం దీన్ని తయారు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొవిడ్‌- 19 నుంచి కోలుకున్న బాధితుల్లో కొంతమంది బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి (మ్యూకార్‌మైకోసిస్‌) బారిన పడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోవడంతో  యాంఫోటెరిసిన్‌ బి ఔషధానికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ ఔషధం దొరకడమూ కష్టమైపోతోంది. దీంతో ఈ ఔషధం తయారీని పెంచడంపై ఫార్మా కంపెనీలు దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా ఫార్మా కంపెనీలకు ఉత్పత్తి పెంపు దిశగా సూచనలు చేసింది. ఉత్పత్తి పెంచాలని స్పష్టం చేయడంతో పాటు అవసరాన్ని బట్టి ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకోడానికీ సిద్ధపడుతోంది. అందువల్ల వచ్చే కొద్ది రోజుల్లో ఈ మందు లభ్యత పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రాల వారీగా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఔషధం లభించే ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సారధ్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేర్కొంది. ఈ వ్యవహారాలను ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ) పర్యవేక్షిస్తోంది.

బ్లాక్‌ ఫంగస్‌ వల్ల..
బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి సకాలంలో చికిత్స చేయని పక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల సైనస్‌, ఊపిరితిత్తులు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. మధుమేహ వ్యాధి ఉన్న వారికి అయితే ఇంకా అధిక నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెలుగులోకి వస్తోంది. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ కొత్తగా ఇటువంటి కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. యాంఫోటెరిసిన్‌ బి 50 ఎంజీ ఇంజెక్షన్‌ తో పాటు సంబంధిత ఇతర మందుల లభ్యత పెంచేందుకు చర్యలు చేపడుతోంది. తాజా పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ఫార్మా కంపెనీలు కొన్ని ఈ ఔషధాల తయారీని అధికం చేసినట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని