రేపటి నుంచి రైట్స్‌ ఇష్యూ మొదటి విడత చెల్లింపులు
close

Published : 16/05/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపటి నుంచి రైట్స్‌ ఇష్యూ మొదటి విడత చెల్లింపులు

ఒక్కో షేరుకు రూ.314.25 కట్టాలి
మే 31 వరకు అవకాశం  
మదుపర్ల సందేహాల నివృత్తికి మళ్లీ  చాట్‌బోట్‌ సేవలు: ఆర్‌ఐఎల్‌  

దిల్లీ: రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూకు సంబంధించి మొదటి విడత చెల్లింపులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఈ విషయంలో మదుపర్లకు సహకారం అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాట్సాప్‌ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. గతేడాది రైట్స్‌ ఇష్యూ ప్రారంభించినప్పుడు కూడా ఈ తరహా చాట్‌బోట్‌ సేవలను ఆర్‌ఐఎల్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది మేలో రైట్స్‌ ఇష్యూ కింద రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.1,257 చొప్పున మొత్తం 42.26 కోట్ల షేర్లను జారీ చేసి కేటాయించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. తొలి విడత కింద ఒక్కో రైట్స్‌ ఈక్విటీ షేరుకు రూ.314.25 (సెక్యూరిటీస్‌ ప్రీమియం రూ.311.75, ముఖ విలువ రూ.2.50 కలిపి)ను సోమవారం అంటే మే 17 నుంచి మే 31 వరకు చెల్లించాలని తెలిపింది. రెండోది లేదా చివరి విడత కింద రూ.628.50ను ఈ ఏడాది నవంబరు 15 నుంచి నవంబరు 29 వరకు చెల్లింపులు చేయాలని పేర్కొంది. మొదటి విడత చెల్లింపులపై ఏమైనా సందేహాలు ఉంటే 1800 892 9999 టోల్‌ఫ్రీ నెంబరుకు చేసి అడగొచ్చని తెలిపింది. ఈ సదుపాయం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం గం.9.00ల నుంచి రాత్రి గం.9.00ల వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. లేదంటే +91 79771 11111 నెంబరుకు వాట్సాప్‌లో హాయ్‌ అని టైప్‌ చేయడం ద్వారా చాట్‌బోట్‌ సాయంతో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది. రైట్స్‌ ఇష్యూ కింద గతేడాది జూన్‌లో ఒక్కోటి రూ.1,257 చొప్పున 42.26 కోట్ల కొత్త షేర్లను మదుపర్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేటాయించింది. షేర్ల కేటాయింపు సమయంలో 25 శాతాన్ని అంటే రూ.314.25ను అర్హులైన మదుపర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన రూ.942.75ను విడతల వారీగా చెల్లించేందుకు వీలు కల్పించింది. ఆ ప్రకారం మొదటి, రెండోది లేదా చివరి విడతల చెల్లింపుల తేదీలను పైవిధంగా కంపెనీ ఖరారు చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని