ఏటీఎంల నుంచి నగదు తీసుకుంటున్నారు
close

Published : 17/05/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏటీఎంల నుంచి నగదు తీసుకుంటున్నారు

చెల్లింపులు మాత్రం డిజిటల్‌లోనే!

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి నగదు వినియోగంపై ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటీఎంల నుంచి పెద్ద మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకుంటున్నా, దాన్ని ఇంట్లో అట్టేపెట్టుకొని చెల్లింపులు మాత్రం డిజిటల్‌ పద్ధతిలో చేస్తున్నారని గుర్తించారు. రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఏటీఎంలకు మాటిమాటికి వెళ్లాల్సిన పని లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారని తేల్చారు. ఇలా తీసుకున్న మొత్తాల్ని అత్యవసర వైద్య సమయాల్లోనే వినియోగించేందుకు దాచుకుంటున్నారని, రోజువారీ చెల్లింపులు ఏవైనా ఉంటే యూపీఐ, డిజిటల్‌ పద్ధతుల్లోనే చెల్లిస్తున్నారని వివరించారు. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గతంలో కంటే 20 శాతం మేర పెరిగిందని, ఇదే సమయంలో డిజిటల్‌ చెల్లింపులు మాత్రం స్థిరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.

సగటు విత్‌డ్రా పెరిగింది
అంతక్రితం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ.2000-3000 వరకు విత్‌డ్రా చేసుకునేవారు. ఇపుడు మాత్రం 20 శాతం అధికంగా రూ.3,000-4,000 వరకు తీసుకుంటున్నారు. సగటున రూ.1000 వరకు లావాదేవీలను యూపీఐలో చేస్తున్నారు. ఇక ఐఎమ్‌పీఎస్‌ ద్వారా చేసే లావాదేవీలు రూ.6,000-7,000 నుంచి రూ.9,000కు చేరాయి.

ఆధార్‌ ఏటీఎమ్‌లలో భారీగా..
ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు వెన్నెముకగా ఉన్న ఆధార్‌ ఏటీఎమ్‌లో విత్‌డ్రాయల్స్‌ భారీగా పెరిగాయి. ‘2020-21 నాలుగో త్రైమాసికంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్‌) ద్వారా రూ.10,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ.7650 కోట్లుగా ఉన్నాయ’ని పేనియర్‌బై వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు. ‘ఏఈపీఎస్‌ లావాదేవీలు గతేడాది రూ.30,000 కోట్లకు పైగా చేరాయి. మా రోజువారీ లావాదేవీలు గరిష్ఠంగా రూ.165 కోట్లకు చేరాయ’ని స్పైస్‌మనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని