48,028 దగ్గర మద్దతు!
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

48,028 దగ్గర మద్దతు!

సెన్సెక్స్‌ విశ్లేషణ
మే 14తో ముగిసిన వారానికి

సమీక్ష: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టపోయాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్‌ సరఫరా సమస్యలు, అమెరికా ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. 2021-22 భారత జీడీపీ వృద్ధి అంచనాలను 13.7 శాతం నుంచి 9.3 శాతానికి మూడీస్‌ తగ్గించింది. ఆహార వస్తువుల ధరలు శాంతించడంతో ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.29 శాతానికి పరిమితమైంది. తక్కువ ప్రాతిపదిక కారణంగా మార్చిలో పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం మేర పెరిగింది. కంపెనీల త్రైమాసిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.6 శాతం పెరిగి 68.7 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.3కు బలపడింది. పలు ప్రపంచ దేశాలు కరోనా ప్రభావం నుంచి కోలుకున్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లు డీలాపడ్డాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1 శాతం నష్టంతో 48,733 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1 శాతం తగ్గి 14,678 పాయింట్ల దగ్గర స్థిరపడింది. లోహ, బ్యాంకింగ్‌, విద్యుత్‌ షేర్లు రాణించాయి. మన్నికైన వినిమయ వస్తువులు, స్థిరాస్తి స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.3621 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1,244 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.6,452 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈక్విటీల్లో రూ.6,427 కోట్లు, డెట్‌ విభాగంలో రూ.25 కోట్లు మేర వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా: గత వారం 48028- 49617 పాయింట్ల శ్రేణిలో స్థిరీకరణకు గురైన మార్కెట్‌.. నష్టాల్లో ముగిసింది. ఈ శ్రేణి నుంచి బయటపడితేనే స్వల్పకాలంలో దిశానిర్దేశం లభిస్తుంది. సూచీలు మరింత బలహీనపడితే.. పెద్ద షేర్లు డీలాపడే అవకాశం ఉంది.
ప్రభావిత అంశాలు : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాల అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. కరోనా కేసుల విజృంభణ కొనసాగడం, వ్యాక్సిన్‌ల గిరాకీ-సరఫరాకు మధ్య అంతరాలు ప్రభావం చూపొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి పెరగడం సెంటిమెంట్‌ను దెబ్బతీయొచ్చు. రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు పొడిగిస్తుండటంతో ఆర్థిక రికవరీ బలహీనపడే ప్రమాదం ఉంది. దేశీయంగా చూస్తే.. టోకు ద్రవ్యోల్బణం, బ్యాంకు రుణాల వృద్ధి గణాంకాలు వెలువడనున్నాయి. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం విడుదల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఈ వారం భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, కోల్గేట్‌-పామోలివ్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బాష్‌, హావెల్స్‌, హిందాల్కో, శ్రీసిమెంట్‌, టొరెంట్‌ పవర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామికోత్పత్తి, జపాన్‌ జీడీపీ, అమెరికా ఫెడ్‌ నిర్ణయాలు, జపాన్‌ పారిశ్రామికోత్పత్తి, అమెరికా ముడిచమురు షేర్ల మార్పు, జపాన్‌ తయారీ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 48,254, 48,000, 47,200
తక్షణ నిరోధ స్థాయులు: 49,172, 49,412, 50,376
స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 48,028 వద్ద కీలక మద్దతు లభించొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని