శిల్పా మెడికేర్‌లో స్పుత్నిక్‌-వి ఉత్పత్తి
close

Published : 18/05/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శిల్పా మెడికేర్‌లో స్పుత్నిక్‌-వి ఉత్పత్తి

డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం
ఈనాడు - హైదరాబాద్‌

రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-విని ఉత్పత్తి చేయబోతున్నట్లు శిల్పా మెడికేర్‌ వెల్లడించింది. దీనికోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో పరిమిత కాలపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. స్పుత్నిక్‌-విని భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. శిల్పా మెడికేర్‌ అనుబంధ సంస్థ శిల్పా బయెలాజికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌బీపీఎల్‌)కు కర్నాటకలోని ధార్వాడ్‌ వద్ద ఉన్న సమీకృత బయోలాజికల్స్‌, పరిశోధన, అభివృద్ధి యూనిట్‌లో స్పుత్నిక్‌-వి టీకాను ఉత్పత్తి చేయబోతున్నట్లు సోమవారం బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. మూడేళ్లపాటు ఈ టీకా ఉత్పత్తిని చేపట్టనుంది. 12 నెలల్లో 5 కోట్ల డోసుల టీకాను తాము ఉత్పత్తి చేస్తామని పేర్కొంది. టీకాకు సంబంధించిన సాంకేతికతను డాక్టర్‌ రెడ్డీస్‌ తమకు బదిలీ చేస్తుందని ఎస్‌బీపీఎల్‌ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం టీకా ఉత్పత్తి బాధ్యత ఎస్‌బీపీఎల్‌, దాని మార్కెటింగ్‌, పంపిణీని డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహిస్తుంది. ఈ రెండు డోసుల స్పుత్నిక్‌-వితో పాటు.. ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ ఉత్పత్తి అవకాశాలనూ రెండు సంస్థలూ పరిశీలిస్తున్నాయని, భవిష్యత్తులో దీన్నీ ఉత్పత్తి చేసే వీలుందని శిల్పా మెడికేర్‌ తెలిపింది.

అపోలో ఆసుపత్రిలో...
భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌-వి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో సోమవారం నుంచి చేపట్టింది. నేడు విశాఖపట్నంలో దీన్ని ప్రారంభిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ తమ 60 కేంద్రాల్లో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు అపోలో హాస్పిటల్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరి ప్రసాద్‌ వెల్లడించారు. స్పుత్నిక్‌-వి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వీటిని పరీక్షించేందుకు తొలి దశలో డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన 50,000 ఉద్యోగులు, వారి కుటుంబాలకు వ్యాక్సిన్‌ను వేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. స్పుత్నిక్‌-వి టీకా డోసు ధర అన్ని ఖర్చులతో కలిపి రూ.1,200-1,250 వరకూ ఉండవచ్చన్నారు.

బారిసిటినిబ్‌ ఉత్పత్తికి వాలంటరీ లైసెన్సు
నాట్కోతో ఎలీ లిల్లీ ఒప్పందం

కొవిడ్‌-19 బాధితులకు సిఫార్సు చేస్తున్న బారిసిటినిబ్‌ ఔషధం ఉత్పత్తి కోసం నాట్కో ఫార్మాకు ‘వాలంటరీ లైసెన్సు’ను జారీ చేస్తున్నట్లు ఎలీ లిల్లీ తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలూ ఒప్పందం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎలీ లిల్లీకి రాయల్టీ చెల్లించాల్సి అవసరం లేకుండా.. ఈ వాలంటరీ లైసెన్సును జారీ చేసినట్లు.. దీనివల్ల కరోనా మహమ్మారి చికిత్సలో ‘బారిసిటినిబ్‌’ మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలవుతుందని తెలిపింది. కీలకమైన ఔషధాలు భారత్‌లో సులువుగా లభించేందుకు వీలుగా ఈ ఒప్పందం తోడ్పడుతుందని వెల్లడించింది. ఇప్పటికే ఎలీ లిల్లీ దేశీయ ఫార్మా సంస్థలు సిప్లా, లుపిన్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌తో వాలంటరీ లైసెన్సు ఒప్పందం కుదుర్చుకుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధిని అదుపు చేసేందుకు వినియోగిస్తున్న ‘బారిసిటినిబ్‌’ ఔషధాన్ని కొవిడ్‌-19 చికిత్సలో భాగంగా ‘రెమ్‌డెసివిర్‌’తో కలిపి ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని క్లినికల్‌ పరీక్షల్లో తేలింది. దీంతో దీనికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) అత్యవసర అనుమతి జారీ చేసింది. హైదరాబాద్‌ సంస్థ నాట్కో ఫార్మా ఇప్పటికే సీడీఎస్‌ఓ నుంచి అత్యవసర అనుమతి పొంది, ఈ ఔషధాన్ని ‘బారినాట్‌’ పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని