నెమ్మదించిన ఐటీ సేవల విపణి
close

Published : 19/05/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెమ్మదించిన ఐటీ సేవల విపణి

2020లో వృద్ధి 5.41 శాతమే
2020-25 మధ్య 7.18% వార్షిక వృద్ధి
ఐడీసీ నివేదిక

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో గతేడాది (2019) దేశీయ ఐటీ, వ్యాపార సేవల విపణి వృద్ధి నెమ్మదించిందని పరిశోధన సంస్థ ఐడీసీ తెలిపింది. 2019లో ఈ విపణి 8.43 శాతం వృద్ధిని నమోదుచేయగా.. 2020లో 5.41 శాతం వృద్ధితో 13.41 బిలియన్‌ డాలర్లకు చేరిందని పేర్కొంది. అయితే 2020-2025 మధ్య ఈ విపణి 7.18 శాతం వార్షిక వృద్ధితో 18.97 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. క్లౌడ్‌, ఆటోమేషన్‌ కృత్రిమ మేధపై పెట్టుబడులను కంపెనీలు పెంచుతుండటం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఐటీ, వ్యాపార సేవల విపణిలో 77.06 శాతం వాటా ఉన్న ఐటీ సేవల విభాగం 2020లో 5.97 శాతం వృద్ధిని నమోదుచేయగా.. 2019లో ఇది 8.91 శాతంగా ఉంది. 2021 నుంచి ఐటీ, వ్యాపార సేవల విపణి క్రమక్రమంగా పుంజుకుంటుందని ఐడీసీ అంచనా వేసింది. అన్ని రంగాల్లోని కంపెనీలు డిజిటల్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందుకు వ్యయ కేటాయింపులు చేయడాన్ని ఇప్పటికే ప్రారంభించాయి. ముఖ్యంగా కొవిడ్‌-19 పరిణామాల అనంతరం ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని ఐడీసీ ఇండియా సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకులు హరీశ్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. కొవిడ్‌-19 ప్రారంభంలో తీవ్రంగా ప్రభావానికి లోనైన తయారీ రంగం కూడా క్లౌడ్‌ ఆధారిత అప్లికేషన్లు, ఆటోమేషన్‌ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఎక్కడి నుంచైనా పని చేసేందుకు కంపెనీలు ఉద్యోగులకు వీలు కల్పించడం, ఆన్‌లైన్‌లో తరగతులు, ఆన్‌లైన్‌లో వీక్షణ (స్ట్రీమింగ్‌) పెరగడం లాంటి మార్పులు చోటుచేసుకోడంతో క్లౌడ్‌ సేవలకు డిమాండు పెరిగిందని, మున్ముందు ఈ రంగం వృద్ధికి ఈ పరిణామమే దోహదం చేస్తుందని ఐడీసీ విశ్లేషించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని