బీమాపై జీఎస్‌టీ భారం
close

Published : 26/05/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీమాపై జీఎస్‌టీ భారం

ఇప్పటికే ప్రీమియాన్ని పెంచిన బీమా సంస్థలు
పాలసీదారులకు పెరిగిన కష్టాలు
తాత్కాలికంగానైనా పన్ను రద్దు చేయాలి
జీఎస్‌టీ సమావేశం నేపథ్యంలో విన్నపాలు
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌-19 రెండో దశ విజృంభణ.. ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో రూ.లక్షల బిల్లులు కట్టలేక జేబులు గుల్లవుతున్నాయి. దీనికి ఆరోగ్య బీమా పాలసీ ఉండటమే కొంత పరిష్కారంగా కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో చాలామంది ఈ పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే బీమా కంపెనీలు ప్రీమియాన్ని పెంచేశాయి. ఫలితంగా పాలసీల కొనుగోలు పెను భారంగా మారింది. ఒక పక్క ప్రీమియం మొత్తం చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటే.. దానిపై 18శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని చూసి పాలసీదారుల గుండెలు గుభేలుమంటున్నాయి.
కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకి ఆసుపత్రిలో చేరితే.. అప్పటి వరకూ సంపాదించిన మొత్తం అంతా ఖాళీ అవుతోంది. రూ.10లక్షలకు మించి బిల్లులు అవుతున్న సంఘటనలూ ఎన్నో చూస్తున్నాం. సంపాదించే కుటుంబ పెద్ద ప్రాణాలను ఈ మహమ్మారి హరించి.. ఆ కుటుంబానికి ఆర్థిక అండనూ దూరం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, గత ఏడాది కాలంగా అటు జీవిత బీమాలో టర్మ్‌ పాలసీలు.. ఇటు ఆరోగ్య బీమా పాలసీలకూ గిరాకీ బాగా పెరిగింది. దీంతోపాటు కొవిడ్‌ రక్షణ కోసం ప్రత్యేక పాలసీలకూ ఆదరణ బాగానే లభించింది. మరోవైపు కొవిడ్‌-19 క్లెయింలు పెరుగుతున్నాయనే కారణంగా బీమా సంస్థలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి.

15-30 శాతం వరకూ..
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న వారికి నిబంధనల మేరకు కొవిడ్‌-19 చికిత్సకు అనుమతి ఉంది. ఆసుపత్రులు ఇచ్చే బిల్లులో ముందే పేర్కొన్న మినహాయింపులకు తప్ప.. మిగతా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. తొలి దశలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి బీమా సంస్థలు ముందే జాగ్రత్తపడ్డాయి. గత ఏడాది అక్టోబరు నుంచే ప్రీమియాన్ని పెంచడం ప్రారంభించాయి. ఉదాహరణకు ఏప్రిల్‌ 2020లో 40 ఏళ్ల వ్యక్తి రూ.3లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే.. ప్రీమియం రూ.4,727గా ఉంది. అదే వ్యక్తి 2021లో పాలసీని పునరుద్ధరణ చేసుకుంటే.. రూ.5,956 చెల్లించాల్సి వస్తోంది. ఒక వ్యక్తికే దాదాపు రూ.1,200 వరకూ అదనపు భారం పడుతుంది. కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే.. ఈ భారం దాదాపు రూ.5,000 వరకూ ఉంటోంది. కొత్త బీమా పాలసీలు తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు కనీసం రూ.5లక్షలకు తప్ప పాలసీ ఇస్తున్న సంస్థలు చాలా తక్కువే. సంస్థ, పాలసీ రకాన్ని బట్టి 22 ఏళ్ల వ్యక్తికి రూ.5లక్షల వ్యక్తిగత బీమా పాలసీ తీసుకోవాలంటే.. కనీసం రూ.6,000 నుంచి రూ.9,000 వరకూ అవుతోంది.
కష్టకాలంలో..
ఎంతో కష్టంగా బీమా ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను పెను భారంగా మారింది. 41 ఏళ్ల వ్యక్తికి రూ.3లక్షల పాలసీ తీసుకుంటే.. రూ.5,956 నికర ప్రీమియం ఉండగా.. దీనిపై 18 శాతం అంటే.. రూ.1,072 జీఎస్‌టీ చెల్లించాలి. కష్టకాలంలో ఇది పాలసీదారులకు భారంగానే మారింది.  మరో పాలసీలో నికర ప్రీమియం రూ.16,175 ఉంటే.. పన్నుతో కలిపి రూ.18,133 అయ్యింది. కరోనా కష్టకాలంలో ఆదాయాలు తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పాలసీదారులకు గుదిబండగా జీఎస్‌టీ మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టర్మ్‌ పాలసీలపైనా ఈ భారం మరింత అధికంగా ఉంటోంది.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..
ఈ నెల 28న జీఎస్‌టీ సమావేశం ఉన్న నేపథ్యంలో.. బీమా పాలసీలపై పన్ను భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు. సాధారణ బీమా ఏజెంట్ల సమాఖ్య ఈ విషయంపై ఆర్థిక మంత్రికి విన్నవించింది. జీఎస్‌టీ కౌన్సిల్‌, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి అభ్యర్థనలను పంపించింది. జీఎస్‌టీ భారం చూసి చాలామంది పాలసీలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీపై పన్ను భారం లేకుంటే.. ప్రీమియం తగ్గుతుంది. ఫలితంగా మరింత మంది ఈ పాలసీలను తీసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్నవారు పాలసీ మొత్తాన్నైనా పెంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని