త్వరలోనే డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి!
close

Published : 26/05/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి!

‘కొవాగ్జిన్‌’పై భారత్‌ బయోటెక్‌ ఆశాభావం
ఈనాడు - హైదరాబాద్‌

‘కొవాగ్జిన్‌’ టీకాకు త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అనుమతి (ఈయూఏ- ఎమెర్జెన్సీ  యూజ్‌ ఆథరైజేషన్‌) లభిస్తుందని భారత్‌ బయోటెక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘దీనికి సంబంధించిన పత్రాలన్నీ జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించాం. ఈ ఏడాది జులై- సెప్టెంబరు నాటికి అనుమతి వచ్చే అవకాశం ఉంది- అని భారత్‌ బయోటెక్‌ మంగళవారం అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ టీకాకు 13 దేశాల్లో అత్యవసర అనుమతి లభించింది. అంతేగాక ‘కొవాగ్జిన్‌’ కు అనుమతి తీసుకునే ప్రక్రియను యూఎస్‌ఏ, బ్రెజిల్‌, హంగరీతో సహా 60 దేశాల్లో మొదలు పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. కొవిడ్‌-19 కు టీకాను పలు దేశాలు తప్పనిసరి చేశాయి. టీకా వేసుకోని విదేశీయులను తమ దేశాల్లోకి అనుమతించటం లేదు. అది కూడా గుర్తింపు ఉన్న టీకా మాత్రమే తీసుకొని ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటి వరకూ ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌- సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (కొవిషీల్డ్‌) టీకాలకు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉంది. మిగిలిన టీకాలు ఈ సంస్థ పరిశీలనలో ఉన్నాయి. అందువల్ల టీకా సంబంధిత ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్న దేశాలకు వెళ్లాలనుకుంటే, ప్రయాణానికి ముందు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొని ‘నెగిటివ్‌’ రిపోర్టు తీసుకొని వెళ్లటం మేలని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
30 నగరాలకు ‘కొవాగ్జిన్‌’ టీకా సరఫరా: దేశవ్యాప్తంగా 30 నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు ‘కొవాగ్జిన్‌’ టీకా సరఫరా చేసినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వివరించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాలు ఉన్నాయి. కేవలం 30 రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో వెల్లడించారు. లాక్‌డౌన్‌, కొవిడ్‌-19 ముప్పు ఉన్నప్పటికీ తమ సిబ్బంది నిర్విరామంగా టీకా ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎఫ్‌డీఏకి ‘కొవాగ్జిన్‌’ సమాచారం
‘కొవాగ్జిన్‌’ టీకాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూఎస్‌లో భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్య సంస్థ అయిన ఆక్యుజెన్‌ ఇంక్‌., అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ)కు అందజేసింది. ఈ మేరకు ‘మాస్టర్‌ ఫైల్‌’ దాఖలు చేసినట్లు ఆక్యుజెన్‌ వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకాను యూఎస్‌లో విక్రయించటానికి భారత్‌ బయోటెక్‌, ఆక్యుజెన్‌ కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం టీకాకు అత్యవసర అనుమతి పొందటానికి అవసరమైన కసరత్తులో భాగంగా ఎఫ్‌డీఏతో సంప్రదింపులు చేపట్టింది. కొవాగ్జిన్‌ టీకాపై నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కూడా దాఖలు చేయాల్సి ఉన్నట్లు, ఈ సమాచారం కోసం ఆక్యుజెన్‌ ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని