కఠిన నిబంధనలతోనే రియల్‌ వృద్ధి
close

Published : 06/06/2021 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కఠిన నిబంధనలతోనే రియల్‌ వృద్ధి

మైహోమ్‌ గ్రూపు ఛైర్మన్‌ రామేశ్వరరావు
ఈనాడు ఇంటర్వ్యూ
ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను సమీక్షించాలి
పౌర సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది
హెచ్‌ఎండీఏను బలోపేతం చేయాలి  
కొవిడ్‌-19 ప్రభావం తీవ్రంగానే ఉంది
ఈనాడు - హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధ్యం కావాలంటే ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌) నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని మైహోమ్‌ గ్రూపు ఛైర్మన్‌ రామేశ్వరరావు అన్నారు. దేశంలోని ఏ నగరంలోనూ 2 లేదా 3 కంటే ఎఫ్‌ఎస్‌ఐ లేదని, కానీ హైదరాబాద్‌ నగరంలో ఎంతో అధికంగా 10 వరకూ కడుతున్నారని, దీనివల్ల భవిష్యత్తులో హైదరాబాద్‌లో పౌర సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని వివరించారు. రియల్‌ ఎస్టేట్ రంగానికి వర్తించే ఇతర చట్టాలు, నిబంధనలను సైతం కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి అవకాశాలు ఉన్నాయని, దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వివరించారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏను బలోపేతం చేయాలన్నారు. రియల్‌ ఎస్టేట్ రంగంపై కొవిడ్‌-19 ప్రభావం బలంగా ఉందని, కోలుకోవటానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. శంషాబాద్‌లో ఒక ‘డ్రీమ్‌ సిటీ’ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచన తమకు ఉన్నట్లు, వచ్చే రెండేళ్లలో దాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. మైహోమ్‌ గ్రూపు మూడున్నర దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రియల్‌ ఎస్టేట్ రంగం స్థితిగతులు, కొవిడ్‌-19 ప్రభావం, మైహోమ్‌ గ్రూపు ప్రణాళికలపై మాట్లాడారు. విశేషాలు..

రియల్‌ ఎస్టేట్పై కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం ఎలా ఉంది, ఎన్నాళ్లిలా ఉంటుంది?
జవాబు: మొదటి విడత కొవిడ్‌-19 తర్వాత నెమ్మదిగా ఆంక్షలు తొలగించటంలో అన్ని వ్యాపార కార్యకలాపాలు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. రియల్‌ ఎస్టేట్ జోరందుకుంది. ఎంతో ఆకర్షణీయమైన పరిస్థితి వచ్చింది. అనుకోని విధంగా కొవిడ్‌-19 రెండో విడత ముంచుకొచ్చింది. ఈసారి బాధితుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉండటంతో పాటు ప్రాణనష్టం అధికంగా జరిగింది. ప్రజల ఉపాధి, ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు వచ్చాయి. దీని ప్రభావం రియల్‌ ఎస్టేట్పై ఎంతో అధికంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు... ఇళ్ల కొనుగోలు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం కష్టం. పరిశ్రమకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేం.

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ వల్ల ఆఫీసు స్థలానికి గిరాకీ తగ్గింది. ఈ ధోరణి భవిష్యత్తులోనూ కొనసాగుతుందా?
ఆఫీసు స్థలానికి ఇప్పుడు గిరాకీ తక్కువగానే ఉంది. వాస్తవానికి హైదరాబాద్‌లో కొవిడ్‌-19 కంటే ముందుగానే ఆఫీసు స్థలం లభ్యత అధికంగా, గిరాకీ తక్కువగా ఉంది. కొవిడ్‌-19 తో ఇంకొంత నష్టం జరిగింది. కానీ మళ్లీ సాధారణ స్థితిగతులు నెలకొని ఉద్యోగ- ఉపాధి అవకాశాలు పెరిగితే ఆఫీసు స్థలానికి గిరాకీ వస్తుంది.

ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్ కొంత మెరుగ్గా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సానుకూలత ఎందుకంటారు...?
హైదరాబాద్‌ నగరానికి ఉన్న ప్రత్యేకతలే దీనికి ప్రధాన కారణం. ఎన్నో పరిశోధనా సంస్థలు, ప్రముఖ విద్యా సంస్థలు, ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, వాతావరణం, రవాణా సదుపాయాలు... హైదరాబాద్‌ను అత్యంత ఆకర్షణీయంగా మార్చాయి.  రోడ్లు, ఫ్లై-ఓవర్ల నిర్మాణం, ఇతర సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి నగరానికి ఇంకా మెరుగులు దిద్దుతోంది. అందుకే ఎంతోమంది ఇక్కడ స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేÆట్ రంగం ఇంకా విస్తరించాలంటే... మీ దృష్టిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అతిక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఎఫ్‌ఎస్‌ఐ (నిర్ణీత స్థలంలో చేపట్టే నిర్మాణ విస్తీర్ణం నిష్పత్తి) నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో ఉన్నంత అధిక ఎఫ్‌ఎస్‌ఐ దేశంలోని ఏ నగరంలోనూ లేదు. దీనివల్ల హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో జనసాంద్రత విపరీతంగా పెరిగే పోయే అవకాశం ఏర్పడుతోంది. తత్ఫలితంగా రోడ్లు, డ్రెయినేజీ, మంచి నీటిసరఫరా... వంటి పౌర సదుపాయాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలో నగరం విస్తరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కాబట్టి అదనంగా సిబ్బందిని సమకూర్చి హెచ్‌ఎండీఏను బలోపేతం చేయాలి. అనుమతుల ప్రక్రియ, పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించేగలిగే విధంగా హెచ్‌ఎండీఏను తీర్చిదిద్దాలి. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎన్నో నిర్మాణాలు కేవలం గ్రామ పంచాయతీల అనుమతితో చేపడుతున్నారు. దీనివల్ల పట్టణ ప్రణాళిక దెబ్బతింటుంది. మురికి కూపాలు పెరిగిపోతాయి. ఇక రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి మోసాలకు తావులేకుండా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గత అయిదారేళ్లుగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, వ్యవసాయ రంగాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. అదే స్థాయిలో హైదరాబాద్‌ నగరంపై దృష్టి పెట్టాలి. తద్వారా హైదరాబాద్‌ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది.

మైహోమ్‌ గ్రూపు రియల్‌ ఎస్టేట్‌, సిమెంటు, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోకి విస్తరించింది. కొత్తగా ఏ రంగాల వైపు చూస్తున్నారు?
ఇటీవల ఓటీటీ (ఓవర్‌- ద- టాప్‌) మీడియా సేవల విభాగంలోకి అడుగుపెట్టాం. ఇక సిమెంటు విభాగంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాం. ప్రస్తుతం దక్షిణాదితో పాటు తూర్పు రాష్ట్రాలైన బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో సిమెంటు విక్రయిస్తున్నాం. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలకు సైతం విస్తరించాలనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాం. దీని కోసం మధ్యప్రదేశ్‌లో కొత్త సిమెంటు యూనిట్ స్థాపించే ఆలోచన ఉంది.

ఇటీవల కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని కొనసాగిస్తారా...?
అవన్నీ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులే. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ప్రాజెక్టును సమీక్షిస్తున్నాం. మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా చేపట్టి వాటిని పూర్తిచేస్తాం.

శంషాబాద్‌లో ఒక ‘డ్రీమ్‌ సిటీ’ నిర్మించాలనే ఆలోచన మీకు ఉంది. దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటికి పూర్తిచేస్తారు?
భవిష్యత్తు తరానికి హైదరాబాద్‌లో మంచి నివాస ప్రాంతాన్ని అందించాలనే ఆలోచనే ఈ ప్రాజెక్టుకు పునాది. శంషాబాద్‌ సమీపంలో దాదాపు 2,000 ఎకరాల స్థలంలో దశల వారీగా దీన్ని నిర్మిస్తాం. ఈ ‘డ్రీమ్‌ సిటీ’ ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యతలను ప్రపంచంలోని టాప్‌-3 ఆర్కిటెక్ట్‌లకు అప్పగించాం. ఆరు నెలల్లో డిజైన్లు సిద్ధమవుతాయి. వచ్చే రెండేళ్ల లోపే నిర్మాణాలు ప్రారంభిస్తాం. దిగువ మధ్యతరగతి ఇళ్ల నుంచి లగ్జరీ హోమ్‌లు, ఆఫీస్‌ స్థలం, షాపింగ్‌ మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్... ఇలా అన్ని రకాలైన సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దుతాం.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని