గెయిల్‌ వ్యాపార విభజన లేదు
close

Published : 10/06/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గెయిల్‌ వ్యాపార విభజన లేదు

పైపులైన్లలో వాటా విక్రయం

దిల్లీ: పైపులైన్‌ వ్యాపారాన్ని విభజించి ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వరంగ సహజవాయువు సంస్థ గెయిల్‌ ఉపసంహరించుకుంది. దానికి బదులుగా పైపులైన్లలో కొంత వాటాను ఇన్విట్‌ ద్వారా విక్రయించనుంది. ‘రెండు పైపులైన్లలో వాటా విక్రయించే ప్రణాళికలను పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు, మౌలికసదుపాయాల పెట్టుబడుల ట్రస్టు (ఇన్విట్‌)కు పంపించాం. ఈ విక్రయ ప్రతిపాదనపై త్వరలోనే అనుమతులు లభిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగానే పైపులైన్లలో వాటా విక్రయం పూర్తయ్యే అవకాశం ఉంటుంద’ని గెయిల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ జైన్‌ తెలిపారు. గెయిల్‌.. దేశంలోనే అతిపెద్ద సహజవాయువు మార్కెటింగ్‌, విక్రయ సంస్థ. దేశం మొత్తం మీద 17,126 కి.మీ పొడవైన గ్యాస్‌ పైపులైన్‌ నెట్‌వర్క్‌ ఉంటే అందులో నాలుగింట మూడు వంతుల వాటా గెయిల్‌దే. సహజవాయువు విక్రయం, పెట్రో రసాయనాల ఉత్పత్తి లాంటి కీలక వ్యాపారాలను అట్టేపెట్టుకుని, పైపులైన్‌ వ్యాపారాన్ని విభజించి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని గతంలో గెయిల్‌ ప్రతిపాదించింది. తాజాగా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని.. పైపులైన్లలో మైనారిటీ వాటా మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దహేజ్‌-ఉరాన్‌-పాన్‌వెల్‌-దభోల్‌ పైపులైన్‌, దభోల్‌-బెంగళూరు పైపులైన్లలో వాటా విక్రయించాలన్నది సంస్థ తాజా ప్రతిపాదన. ఇన్విట్స్‌ అనేవి మ్యూచువల్‌ఫండ్‌ లాంటివే. వ్యక్తిగత/సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి నిధులు సమకూర్చేందుకు ఉపయోగపడతాయి. వీటిపై వచ్చే ఆదాయాన్ని ప్రతిఫలంగా అందిస్తాయి. తొలిదశలో 10-20 శాతం వాటాను ఇన్విట్‌ విక్రయించే వీలుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని