సంక్షిప్త వార్తలు
close

Published : 11/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

గాయత్రీ ప్రాజెక్ట్స్‌పై ఎన్‌హెచ్‌ఏఐ నిషేధం

దిల్లీ: కొత్త ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనకుండా గాయత్రీ ప్రాజెక్ట్స్‌పై జాతీయ రహదార్ల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిషేధం విధించింది. చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయనందున ఈ చర్య తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌- వారణాసి మధ్య నాలుగు వరసల రహదారి నిర్మాణ కాంట్రాక్టును చేపట్టిన గాయత్రీ ప్రాజెక్ట్స్‌, కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. రహదారి నిర్మాణంలో జరుగుతున్న లోపాలను సంస్థకు నివేదించి వివరణ కోరామని, దానికి  సంస్థ ఇచ్చిన వివరణ ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని వివరించింది. ప్రాజెక్టు ప్రగతి సరిగా లేదని, పైగా కాంక్రీట్‌ పేవ్‌మెంట్‌లో పగుళ్లు, రహదారి భద్రతా చిహ్నాలు లేకపోవటం.. వంటి ఎన్నో లోపాలు కనిపించినట్లు పేర్కొంది.  


జీఎస్టీ మండలి భేటీ రేపు

దిల్లీ: కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే విషయమై చర్చించడానికి ఈ నెల 12న జీఎస్టీ మండలి సమావేశం కానుంది. టీకాలు, బ్లాక్‌ ఫంగస్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. దీనిపై అధ్యయనం చేయడానికి నియమించిన మంత్రుల బృందం సోమవారం తన నివేదిక సమర్పించింది. దీని ఆధారంగానే రానున్న సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం దేశంలో తయారయ్యే టీకాలపై 5%, ఇతర మందులు, పరికరాలపై 12% జీఎస్టీ అమల్లో ఉంది.


ఐటీలో విప్రో సీఈఓకే అధిక వేతనం
థియర్రీ డెలాపోర్ట్‌కు రూ.64 కోట్లు

దిల్లీ: విప్రో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) థియర్రీ డెలాపోర్ట్‌ గత ఆర్థిక సంవత్సరంలో 8.7 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64.3 కోట్లు) వార్షిక వేతనం అందుకున్నట్లు నియంత్రణ సంస్థలకు సంస్థ సమాచారం అందించింది. ఏకకాల నగదు పురస్కారం, వార్షిక స్టాక్‌ గ్రాంట్‌, ఏకకాల ఆర్‌ఎస్‌యూ (రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు) గ్రాంట్‌ వంటివన్నీ కలిపి 2020 జులై 6 నుంచి 2021 మార్చి 31 వరకు ఆయన ఈ మొత్తం అందుకున్నట్లు విప్రో తెలిపింది. గతంలో క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన థియర్రీ విప్రో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అబిదాలీ నీముచ్‌వాలా నుంచి 2020 జులై 6న బాధ్యతలు స్వీకరించారు. విప్రో 20-ఎఫ్‌ ఫైలింగ్‌ ప్రకారం, డెలాపోర్ట్‌ 1.31 మిలియన్‌ (సుమారు రూ.9.6 కోట్లు) వేతనం, అలవెన్సుల రూపంలో, 1.54 మిలియన్‌ డాలర్ల కమీషన్‌ - వేరియబుల్‌ పే రూపంలో,  5.18 మిలియన్‌ డాలర్లు ఇతర రూపంలో అందుకున్నట్లు విప్రో వివరించింది. దేశీయంగా ఐటీ సేవల రంగం నుంచి అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్‌గా డెలాపోర్ట్‌ నిలిచారు. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రూ.49.68 కోట్లు, టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ రూ.20.36 కోట్లు వార్షిక వేతనంగా అందుకున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని