సంక్షిప్త వార్తలు
close

Updated : 12/06/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

600 బిలియన్‌ డాలర్ల పైకి ఫారెక్స్‌ నిల్వలు

ముంబయి: దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు మొట్టమొదటి సారిగా 600 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. జూన్‌ 4తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 6.842 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.50000 కోట్లు) పెరిగి జీవనకాల గరిష్ఠమైన 605.008 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.44 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతకు ముందు మే 28తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 5.271 బిలియన్‌ డాలర్లు పెరిగి 598.165 బిలియన్‌ డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు 7.362 బిలియన్‌ డాలర్లు పెరిగి 560.890 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41 లక్షల కోట్ల)కు చేరాయి. బంగారు నిల్వలు 502 మిలియన్‌ డాలర్లు తగ్గి 37.604 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌)  1 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.513 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో దేశ నిల్వల స్థానం  16 మిలియన్‌ డాలర్లు తగ్గి 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.36000 కోట్లు)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది.

1 నుంచి సిండికేట్‌ బ్యాంకు శాఖల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారతాయ్‌

బెంగళూరు: సిండికేట్‌ బ్యాంకు శాఖల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు 2021 జులై 1 నుంచి మారతాయని కెనరా బ్యాంకు వెల్లడించింది. కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ 2020 ఏప్రిల్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సిండికేట్‌బ్యాంక్‌ ఖాతాదారులుగా ఉన్నవారు నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు జులై 1 నుంచి కెనరా బ్యాంకు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కెనరా బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా లేదా కెనరా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ నుంచి లేదా కెనరాబ్యాంక్‌.కామ్‌/ఐఎఫ్‌ఎస్‌సీ.హెచ్‌టీఎమ్‌ఎల్‌ అనే యూఆర్‌ఎల్‌ సాయంతో కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగదార్లు పొందొచ్చని తెలిపింది. మారిన ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ కోడ్‌లతో సిండికేట్‌ బ్యాంకు వినియోగదార్లు కొత్త చెక్కు బుక్‌లు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

లిఖితా ఇన్‌ఫ్రా లాభం రూ.13.02 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: లిఖితా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మార్చి త్రైమాసికానికి రూ.74.89 కోట్ల ఆదాయంపై రూ.13.02 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.50.80 కోట్లు, నికరలాభం రూ.3.79 కోట్లు మాత్రమే. ఈసారి నికరలాభం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తి కాలానికి ఆదాయం రూ.192.93 కోట్లు, నికరలాభం రూ.28.98 కోట్లు, ఈపీఎస్‌ రూ.17.05 నమోదయ్యాయి. 2019-20లో ఆదాయం రూ.162.79 కోట్లు, నికరలాభం రూ.20.18 కోట్లు, ఈపీఎస్‌ రూ.13.80 ఉన్నాయి. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.1.50 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని నిర్ణయించినట్లు లిఖితా ఇన్‌ఫ్రా ఎండీ జి.శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని