15800 ఎగువకు నిఫ్టీ
close

Published : 12/06/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15800 ఎగువకు నిఫ్టీ

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు
మదుపర్ల సంపద రూ.231 లక్షల కోట్లకు
సమీక్ష

టీ, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. నిఫ్టీ 15,800 పాయింట్ల శిఖరాన్ని అందుకుంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ల జోరుకు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగియడం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పైసా తగ్గి 73.07 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపద గత రెండు రోజుల్లో రూ.3.26 లక్షల కోట్లు పెరిగి తాజా రికార్డు గరిష్ఠమైన రూ.231.11 లక్షల కోట్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, టోక్యో నష్టపోగా.. హాంకాంగ్‌, సియోల్‌ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 52,477.19 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే దూకుడు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 52,641.53  పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 174.29 పాయింట్ల లాభంతో 52,474.76 వద్ద ముగిసింది. 15835.55 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరిన నిఫ్టీ.. చివరకు 61.60 పాయింట్లు పెరిగి 15,799.35 దగ్గర స్థిరపడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 374.71 పాయింట్లు, నిఫ్టీ 129.10 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి.

ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేయడంతో సెయిల్‌ షేరు ఇంట్రాడేలో 5.56 శాతం పరుగులు తీసి రూ.135.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 5.06 శాతం లాభంతో రూ.135.05 వద్ద ముగిసింది.
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ షేరు ఇంట్రాడేలో 3.67 శాతం పెరిగి  రూ.283.75 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాల ఒత్తిడితో చివరకు 0.68 శాతం నష్టంతో రూ.271.85 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 3.03%, పవర్‌గ్రిడ్‌ 1.97%, టీసీఎస్‌ 1.73%, ఇన్ఫోసిస్‌ 1.56%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.54%, రిలయన్స్‌ 1.39%, టెక్‌ మహీంద్రా 0.88% చొప్పున రాణించాయి. ఎల్‌ అండ్‌ టీ 1.07%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.80%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.78%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.76%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.71% డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, ఐటీ, ఇంధన, టెక్‌, ఆరోగ్య సంరక్షణ 3.21 శాతం వరకు పెరిగాయి. స్థిరాస్తి, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్‌, టెలికాం, మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ పడ్డాయి. బీఎస్‌ఈలో 1731 షేర్లు లాభాల్లో ముగియగా, 1465 స్క్రిప్‌లు నష్టపోయాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని