ఆర్థిక పురోగతిలో తీవ్ర అసమానతలు
close

Published : 14/06/2021 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక పురోగతిలో తీవ్ర అసమానతలు

 ఉపశమన చర్యలు అవసరమే
ఆర్‌బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు

దిల్లీ: ఆర్థిక వ్యవస్థ పురోగతిలో తీవ్ర అసమానతలు నెలకొనడం, ధనిక- పేదల మధ్య ఆర్థిక అంతరం మరింతగా పెరుగుతుండటంపై ఆర్‌బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం మున్ముందు దేశ వృద్ధి అవకాశాల పైనా ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.  ‘నాలుగు దశబ్దాల్లో తొలిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ మైనస్‌లోకి జారుకుంది. తొలుత భయపడిన స్థాయిలో వృద్ధి నెమ్మదించనప్పటికీ, అసంఘటిత రంగంలోని లక్షల కుటుంబాల జీవన స్థితిగతులపై ప్రభావం పడింది. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవచ్చని ప్రారంభంలో వేసుకున్న అంచనాలను కొవిడ్‌-19 రెండో దశ దెబ్బకొట్టింద’ని సుబ్బారావు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి ఆర్‌బీఐ తగ్గించడంపై ఆయన స్పందిస్తూ.. 9.5 శాతం కూడా మెరుగైన వృద్ధే అయినప్పటికీ, కిందటేడాది బేస్‌ ఎఫెక్ట్‌ కలిసిరావడాన్ని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.  
స్టాక్‌ మార్కెట్‌ దూకుడుతో ఎవరికి ప్రయోజనం..
చాలా మంది ప్రజల ఉద్యోగాలు పోయి ఆదాయాలు క్షీణించగా, కొందరి సంపద మాత్రమే గణనీయంగా పెరగడంపై దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు ఆర్థిక అసమాతనలు మరింతగా పెరిగాయనడానికి స్టాక్‌ మార్కెట్‌ దూకుడు ఓ సంకేతమని అన్నారు. ‘స్టాక్‌ మార్కెట్‌ పెరగడం వల్ల ఎవరు ప్రయోజనం పొందారు? ఎవరి దగ్గర పెట్టుబడులు పెట్టేంత మిగులు నిధులు ఉన్నాయి? అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ఏడాదికాలంలో 23 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. పేదరికం రేటు గ్రామీణ ప్రాంతంలో 15%, పట్టణాల్లో 20% పెరిగిందని అంటోంది. కొవిడ్‌-19 రెండో దశ కారణంగా మేలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరిందని, కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని, 97% మంది ఆదాయాలు తగ్గిపోయాయని సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయ’ని సుబ్బారావు గుర్తు చేశారు. ఇన్నాళ్లుగా కూడబెట్టిన డబ్బును వైద్య ఖర్చుల కోసమే ప్రజలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలను ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని