కుప్పకూలిన అదానీ షేర్లు
close

Published : 15/06/2021 05:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుప్పకూలిన అదానీ షేర్లు

3 విదేశీ ఫండ్‌ల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపచేసినట్లు వార్తలు
అదానీ సంస్థల్లో వీటికి రూ.43,500 కోట్ల పెట్టుబడులు
దిల్లీ

ఆసియా కుబేరుల్లోనే రెండో స్థానానికి చేరిన గౌతమ్‌ అదానీ గ్రూప్‌నకు సోమవారం భారీ షాక్‌ ఎదురైంది. ఈ గ్రూప్‌ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు)- అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాసిటరీ లిమిటెడ్‌) మే 31 నుంచి స్తంభింపజేసినట్లు వార్తలు రావడంతో, అదానీ గ్రూప్‌ షేర్ల విలువలు 5-25 శాతం వరకు పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌లలో ఈ మూడు ఎఫ్‌పీఐలు అధిక పెట్టుబడులు పెట్టాయి.
అదానీ గ్రూప్‌ వివరణ ఇదీ
ఈ మూడు సంస్థల ఖాతాలను స్తంభింప చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని, పెట్టుబడిదార్లను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఈ తప్పుడు ప్రచారం వల్ల మదుపర్లకు తీరని ఆర్థిక నష్టం కలిగిందని గ్రూప్‌ పేర్కొంది. ఆ 3 ఎఫ్‌పీఐ డీమ్యాట్‌ ఖాతాలపై సరైన సమాచారం ఇవ్వాలని రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ను అభ్యర్థించామని అదానీ గ్రూప్‌ తెలిపింది. డీమ్యాట్‌ ఖాతాలను స్తంభింప చేయలేదని అక్కడ నుంచి తమకు ఇ మెయిల్‌లో సమాధానం వచ్చిందని స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌డీఎల్‌ కూడా సోమవారం రాత్రి ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.

ఇదీ జరిగింది
అల్బులా (పాన్‌ సంఖ్య- ఏఏహెచ్‌సీఏ3597క్యూ), క్రెస్టా ఫండ్‌ (పాన్‌ సంఖ్య- ఏఏఈసీఎం5148ఏ),  ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పాన్‌ సంఖ్య- ఏఏడీసీసీ2634ఏ)ల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపజేసినట్లు ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో, సోమవారం ఉదయం నుంచీ అదానీ గ్రూప్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి.
*ఏస్‌ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ నెల 11కు అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఆ 3 ఎఫ్‌పీఐలకు రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. సోమవారం ఉదయం షేర్ల విలువ పతనంతో ఈ విలువ  రూ.40,058 కోట్లకు చేరింది.
* మారిషస్‌లోని పోర్ట్‌ లూయిస్‌లో నమోదు చేసుకున్న మూడు ఎఫ్‌పీఐల నికర సంపద రూ.41,046 కోట్లుగా ట్రెండ్‌లైన్‌ డేటా చెబుతోంది. ఈ మొత్తంలో 96 శాతానికి పైగా అదానీ గ్రూప్‌ షేర్లలోనే పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఈ ఏడాది మార్చికి నాలుగు అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఈ మూడు ఫండ్లకు 2.1- 3.9 శాతం మధ్య వాటాలు ఉన్నాయి. మార్చి తర్వాత అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ల్లో వాటాలను ఈ సంస్థలు 10 సార్లకు పైగా పెంచుకున్నట్లు తెలిపింది.  
ఇతర ఎఫ్‌పీఐలకే అధిక వాటా: అదానీ గ్రూప్‌ 4 కంపెనీల్లో ఎఫ్‌పీఐలకు భారీగా వాటాలు ఉన్నాయి. ఖాతాలు స్తంభింప చేసినట్లు వార్తలొచ్చిన మూడే కాకుండా మరిన్ని పెద్ద ఎఫ్‌పీఐలు కూడా అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మూడు ఎఫ్‌పీఐల వాటాలతో పోలిస్తే ఇతర ఎఫ్‌పీఐలకే ఎక్కువ వాటాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చికి 3 మారిషస్‌ సంస్థలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 6.8%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 8%, అదానీ టోటల్‌లో 3.5%, అదానీ గ్రీన్‌ల్లో 3.5% వాటాలు ఉన్నాయి. అయితే ఎలారా ఇండియా ఆపర్చ్యునిటీస్‌ ఫండ్‌, ఎల్‌టీఎల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, వెస్పెరా ఫండ్‌, ఆసియా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మారిషస్‌ వంటి ఎఫ్‌పీఐలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 8%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 9.1%, అదానీ టోటల్‌లో 7.1%, అదానీ గ్రీన్‌ల్లో 7.7% వాటాలు ఉన్నాయి. దేశీయ సంస్థల్లో ఎల్‌ఐసీకీ అదానీ గ్రూప్‌లో చెప్పుకోదగ్గ వాటాలే ఉన్నాయి.

సాయంత్రానికి కోలుకున్నా..
అదానీ గ్రూప్‌ వివరణ తరవాత గ్రూప్‌ షేర్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇంట్రాడేలో 24.99 శాతం పతనవ్వగా.. చివరకు 6.26 శాతం నష్టంతో రూ.1501.25 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 8.36 శాతం, అదానీ గ్రీన్‌ 4.13 శాతం కుదేలయ్యాయి. చివరికి అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5 శాతం, అదానీ పవర్‌ 4.99 శాతం నష్టపోయి లోయర్‌  సర్క్యూట్‌కు పడిపోయాయి.
మదుపరికి ఇంత నష్టం
అదానీ గ్రీన్‌కు రూ.7929.55 కోట్లు, అదానీ టోటల్‌ గ్యాస్‌కు రూ.8935.96కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌కు రూ.8781.98 కోట్లు, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌కు రూ.11,021.1 కోట్లు, అదానీ పోర్ట్స్‌కు రూ.14,321.68 కోట్లు.. మొత్తంమీద రూ.53,834 కోట్లకు పైగా సంపద హరించుకు పోయింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని