అమర రాజా బ్యాటరీస్‌ ఛైర్మన్‌గా జయదేవ్‌ గల్లా
close

Updated : 15/06/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమర రాజా బ్యాటరీస్‌ ఛైర్మన్‌గా జయదేవ్‌ గల్లా

ఏజీఎం తర్వాత బాధ్యతల స్వీకరణ
లిథియమ్‌-ఆయాన్‌ ఉత్పత్తుల విభాగంలో విస్తరణ

ఈనాడు-తిరుపతి: అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌బీఎల్‌) ఛైర్మన్‌గా ప్రస్తుత వైస్‌ ఛైర్మన్‌ జయదేవ్‌ గల్లా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం దృశ్యమాధ్యమ విధానంలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్‌బీఎల్‌ వ్యవస్థాపకులైన డాక్టర్‌ రామచంద్ర ఎన్‌.గల్లా 36 ఏళ్లుగా సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వర్తించలేని డాక్టర్‌ రామచంద్ర స్పష్టం చేయగా, అందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. సుదీర్ఘకాలం  సంస్థకు సేవలు అందించినందుకు బోర్డు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఆయన స్థానంలో జయదేవ్‌ గల్లాను ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆగస్టులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకు రామచంద్ర ఎన్‌.గల్లా ఛైర్మన్‌గా కొనసాగుతారు. ఆ తర్వాత ఛైర్మన్‌గా జయదేవ్‌ గల్లా బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా హర్షవర్ధన్‌ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని లను నియమించారు. స్వతంత్య్ర డైరెక్టర్‌గా అన్నుష్‌ రామస్వామిని ఎంపిక చేశారు.  
విస్తరణ ప్రణాళికలు: ఎనర్జీ, మొబిలిటీ విభాగాల్లో విస్తరించాలని, వేగవంతమైన వృద్ధి సాధించాలని అమరరాజా బ్యాటరీస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల వ్యాపారం విస్తరణ, లిథియం సెల్‌, బ్యాటరీ ప్యాక్‌, ఇవీ ఛార్జర్లు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌, అడ్వాన్స్‌ హోమ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌.. తదితర ఉత్పత్తులు/ సేవలు అందించడానికి కొత్త వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో ‘న్యూ- ఎనర్జీ’ రంగంలో పెద్దఎత్తున అవకాశాలు అందివస్తాయని,  లెడ్‌ బ్యాటరీ వ్యాపారం సైతం విస్తరిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఏఆర్‌బీఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ జయదేవ్‌ గల్లా తెలిపారు. దీనికి అనుగుణంగా కంపెనీ తరఫున పెట్టుబడులు పెడతామని వివరించారు. వాహన, పారిశ్రామిక, టెలికాం, డేటా సెంటర్ల విభాగాల నుంచి డిమాండ్‌ ఉండటం వల్ల లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల వ్యాపారం విస్తరిస్తోందని అభిప్రాయపడ్డారు.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని