కొత్త వెబ్‌సైట్‌ కష్టాలు తీరలేదు
close

Published : 15/06/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త వెబ్‌సైట్‌ కష్టాలు తీరలేదు

దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభంగా దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన కొత్త వెబ్‌సైటు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అందుబాటులోకి తీసుకొచ్చినా, వెబ్‌సైటులో పలు ఇబ్బందులు వస్తున్నాయని ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వెబ్‌సైట్‌ రూపొందించిన ఇన్ఫోసిస్‌తో పాటు నందన్‌ నీలేకనికి ట్విటర్‌లో మంత్రి సూచించారు. సాంకేతిక ఇబ్బందులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని నీలేకని బదులిచ్చారు కూడా. ఇంకా వెబ్‌సైటు పనితీరు మెరుగుపడలేదని పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు.  లాగిన్‌ సమస్యలు తలెత్తడంతో పాటు, డిజిటల్‌ సిగ్నేచర్‌ను మరోసారి రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరడం లాంటివి ఇబ్బందిగా ఉందని పన్ను నిపుణులు తెలిపారు. వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేసేందుకూ ఎంతో సమయం తీసుకుంటోంది. గతంలో దాఖలు చేసిన ఆదాయపు రిటర్నులను చూసుకోవడమూ కష్టంగానే మారిందని, ఏది చూసినా.. త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే సమాచారమే కనిపిస్తోందని చెబుతున్నారు.  
15సీఏ/15సీబీ పత్రాలను నేరుగా..
విదేశాల నుంచి వచ్చిన డబ్బును తీసుకునేందుకు (ఫారిన్‌ రెమిటెన్సెస్‌) సమర్పించే ఫారం 15సీఏ/15సీబీ ఫారాలను ఎలక్ట్రానిక్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ నిధులకు సంబంధించి 15సీఏను ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సర్టిఫికెట్‌ 15సీబీతో కలిపి ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, కొత్త వెబ్‌సైటులో ఎదురవుతున్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా 15సీఏ/15సీబీ పత్రాలను ఎలక్ట్రానిక్‌ రూపంలో కాకుండా.. పత్రాలను వ్యక్తిగతంగా అధీకృత డీలర్లకు అందిస్తే సరిపోతుందని సీబీడీటీ పేర్కొంది. అధీకృత డీలర్లు ఈ పత్రాలను జూన్‌ 30 వరకు అంగీకరించేందుకు వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఈ పత్రాలను తప్పనిసరిగా ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైటులో అప్‌లోడ్‌ చేసి, డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు తీసుకోవాలని సూచించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని