నాట్కో ఫార్మా కేన్సర్‌ మందుకు అమెరికాలో అనుమతి
close

Published : 15/06/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాట్కో ఫార్మా కేన్సర్‌ మందుకు అమెరికాలో అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: ‘మల్టిపుల్‌ మైలోమా’ అనే కేన్సర్‌ వ్యాధికి కీమోథెరపీ చికిత్సలో వినియోగించే కార్ఫిల్‌జొమిబ్‌ జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేయటానికి నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. తన భాగస్వామ్య సంస్థ అయిన బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాస్యూటికల్‌తో కలిసి ఈ ఔషధానికి అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) వద్ద ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌) దాఖలు చేయగా, అనుమతి లభించినట్లు నాట్కో ఫార్మా సోమవారం వెల్లడించింది. కార్ఫిల్‌జొమిబ్‌ వయల్స్‌ 10 ఎంజీ, 60 ఎంజీ డోసు జనరిక్‌ ఔషధాన్ని విక్రయించడానికి తుది అనుమతి లభించగా, 30 ఎంజీ డోసు ఔషధానికి తాత్కాలిక అనుమతి లభించినట్లు వివరించింది. ఏఎన్‌డీఏ దరఖాస్తు దాఖలు చేసిన తేదీ ప్రకారం ఈ ఔషధానికి సంబంధించిన తనకు 180 రోజుల ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులు (ఈఎంఆర్‌) లభించే అవకాశం ఉందని నాట్కో ఫార్మా భావిస్తోంది. కార్ఫిల్‌జొమిబ్‌ ఔషధాన్ని ఓనిక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ అభివృద్ధి చేసింది. దీన్ని ‘కైప్రోలిస్‌’ అనే బ్రాండు పేరుతో ఈ సంస్థ విక్రయిస్తోంది. 2020 లో కైప్రోలిస్‌ ఔషధం 696 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదు చేసింది. కేవలం 10 ఎంజీ డోసు ఔషధం అమ్మకాలే 63 మిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నాయి.  ఈ ఔషధం పేటెంట్‌కు సంబంధించి ఓనిక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌తో 2019లో నాట్కో ఫార్మా- బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కార్ఫిల్‌జొమిబ్‌ జనరిక్‌ ఔషధాన్ని నాట్కో ఫార్మా- బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాస్యూటికల్స్‌ యూఎస్‌ మార్కెట్లో 2027లో/అంతకంటే ముందు కానీ విడుదల చేయొచ్చు. ఈ మేరకు ఓనిక్స్‌ లైసెన్సు ఇచ్చింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని