సంక్షిప్త వార్తలు
close

Published : 15/06/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

-539 నుంచి +77 పాయింట్లకు

సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకుని తాజా గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దూసుకెళ్లడం కలిసొచ్చింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, కొవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పట్టడం ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 22 పైసలు తగ్గి  73.29 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్‌ లాభపడ్డాయి. హాంకాంగ్‌, షాంఘై పనిచేయలేదు. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే అదానీ గ్రూప్‌ సహా ఇతర ప్రధాన షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. కొద్దిసేపటికే 51,936.31 పాయింట్లకు పడిపోయింది. అప్పటికి సెన్సెక్స్‌ నష్టం 539 పాయింట్లు. అక్కడ నుంచి కోలుకున్న సెన్సెక్స్‌.. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 52,590.92 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసి.. చివరకు 76.77 పాయింట్ల లాభంతో 52,551.53 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఒకానొకదశలో 15,606.50 పాయింట్లకు పతనమైంది. చివరకు 12.50 పాయింట్లు పెరిగి 15,811.85 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్‌, నిఫ్టీలకు ఇవి రికార్డు ముగింపు కావడం విశేషం.

* త్రైమాసిక నష్టం మరింత పెరగడంతో భెల్‌ షేరు ఇంట్రాడేలో 17.91 శాతం కోల్పోయింది. చివరకు 11.61 శాతం నష్టంతో రూ.67.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3081 కోట్లు తగ్గి రూ.23451.70 కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.46%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.23%, ఓఎన్‌జీసీ 1.05%, ఇన్ఫోసిస్‌ 1.01%, పవర్‌గ్రిడ్‌ 0.97%, ఎల్‌ అండ్‌ టీ 0.86% చొప్పున రాణించాయి. కోటక్‌ బ్యాంక్‌ 1.51%, హెచ్‌డీఎఫ్‌సీ 0.76%, సన్‌ఫార్మా 0.59%, బజాజ్‌ ఆటో 0.57% మాత్రం డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఇంధన, ఐటీ, టెక్‌, చమురు- గ్యాస్‌ 0.81 శాతం వరకు పెరిగాయి. విద్యుత్‌, స్థిరాస్తి, పరిశ్రమలు, యుటిలిటీస్‌, యంత్ర పరికరాలు పడ్డాయి.

 

రాంకీ ఇన్‌ఫ్రా లాభం రూ.48.11 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మౌలిక సదుపాయాల రంగానికి చెందిన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.297.88 కోట్ల స్టాండలోన్‌ ఆదాయాన్ని, రూ.48.11 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.6.92గా నమోదైంది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.310 కోట్లు ఉండగా, రూ.6 కోట్ల నికర నష్టం నమోదు కావటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రూ.1009.16 కోట్ల ఆదాయాన్ని, రూ.53.82 కోట్ల నికరలాభాన్ని, రూ.7.80 ఈపీఎస్‌ను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్స్‌ వ్యయం రూ.75.15 కోట్లకు పరిమితం అయింది. 2019-20లో ఫైనాన్స్‌ వ్యయం రూ.89.49 కోట్లు ఉండటం గమనార్హం. ఏకీకృత ఖాతాల ప్రకారం రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.333.94 కోట్ల ఆదాయం, రూ.85.32 కోట్ల నికరలాభం, రూ.11.51 ఈపీఎస్‌ ఆర్జించింది. 2019-20 ఇదే కాలంలో ఆదాయం రూ.356.69 కోట్లు, నికర నష్టం రూ.178.76 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఏకీకృత ఆదాయం రూ.1240.93 కోట్లు, నికరలాభం రూ. 18.94 కోట్లు, ఈపీఎస్‌ రూ.2.83గా నమోదయ్యాయి.
 

ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచేందుకు హనీవెల్‌, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌-ఐఐపీ జట్టు

దిల్లీ: మనదేశంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచడానికి హనీవెల్‌, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. బోయింగ్‌ కంపెనీ, కెనడాకు చెందిన బంబాడియర్‌ ఇంక్‌., కు విమానాల విడిభాగాలను హనీవెల్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.   మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం భారతీయ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్నట్లు హనీవెల్‌ వెల్లడించింది. ఆక్సిజన్‌ అబ్జార్బెంట్స్‌ సరఫరాకు సైతం ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. హనీవెల్‌ యూఓపీ, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌-ఐఐపీ శాస్త్రవేత్తలు దీని కోసం ఒక బృందంగా కలిసి పనిచేస్తారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతదేశానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఇటలీలో ఉన్న తమ ఉపకరణాలు, నిపుణులను భారతదేశానికి మళ్లిస్తున్నట్లు హనీవెల్‌ ఇండియా అధ్యక్షుడు అక్షయ్‌ బెల్లారే తెలిపారు.


 

పాలసీదార్లకు రూ.867 కోట్ల బోనస్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో అర్హులైన పార్టిసిపేటింగ్‌ పాలసీదార్లకు మొత్తం రూ.867 కోట్ల వార్షిక బోనస్‌ ప్రకటించినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. 2019-20 బోనస్‌తో పోలిస్తే ఇది 10శాతం అధికమని వెల్లడించింది. మార్చి 31, 2021 నాటికి అమలులో ఉన్న పార్టిసిపేటింగ్‌ పాలసీలన్నింటికీ ఈ బోనస్‌ అందుకోడానికి అర్హత ఉంటుంది. దాదాపు 9.8 లక్షల మంది పాలసీదారులకు ఈ బోనస్‌ ప్రయోజనాలు అందుతాయని సంస్థ తెలిపింది. బోనస్‌ మొత్తాన్ని పాలసీ ప్రయోజనాలకు జమ చేస్తారు. గత 15 ఏళ్ల కాలంలో 2020-21లోనే అత్యధిక బోనస్‌ అందించినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఎండీ-సీఈఓ ఎన్‌ ఎస్‌ కణ్ణన్‌ తెలిపారు. 96.9శాతం పెట్టుబడులను సావరీన్‌, ఏఏఏ రేటింగ్‌ ఉన్న పేపర్లలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు.

 

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ రూ.150 కోట్ల సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌ సేవల సంస్థ ఆజాద్‌ ఇంజనీరింగ్‌, డీఎంఐ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ నుంచి 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి (దాదాపు రూ.150 కోట్లు) సమీకరించింది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న రెండో యూనిట్‌ కోసం ఈ నిధులు వెచ్చిస్తారు. వచ్చే మూడేళ్లలో దాదాపు 80 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ నిర్మించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడత కింద 20 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఏరోస్పేస్‌, ఇంజనీరింగ్‌ సంస్థలకు అవసరమైన విడిభాగాలను ఈ యూనిట్లో తయారు చేస్తారు. వచ్చే అయిదేళ్లలో 250 మిలియన్‌ డాలర్ల  ఆర్డర్లు లభించే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. జీఈ, మిత్సుబిషి, సీమెన్స్‌, తోషిబా, మ్యాన్‌, దూసాన్‌ స్కోడా, జీఈ ఏవియేషన్‌, బోయింగ్‌, హనీవెల్‌, ఈటన్‌, రఫేల్‌, బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, బేకర్‌ హ్యూష్‌ తదితర కంపెనీలకు ఓఈఎం (ఒరిజనల్‌ ఎక్వీప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్‌) సంస్థగా ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ఉంది. వచ్చే అయిదేళ్లలో ఏటా 50 శాతం చొప్పున వృద్ధి నమోదు చేయగలుగుతామని ఆజాద్‌ ఇంజనీరింగ్‌ వ్యవస్థాపకుడు రాకేష్‌ ఛోప్దార్‌ వివరించారు. తక్కువ సమయంలో ఆజాద్‌ ఇంజనీరింగ్‌ మెరుగైన నైపుణ్యాలు సంపాదించిందని డీఎంఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ అన్షుమన్‌ మలూర్‌ పేర్కొన్నారు.  

 

15 నిమిషాల్లో వెబ్‌సైట్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే చిన్న వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలకు 15 నిమిషాల్లో సొంత వెబ్‌సైటు తయారు చేసి ఇస్తున్నట్లు డాట్‌పే వెల్లడించింది. తమ డిజిటల్‌ షోరూం ద్వారా వ్యాపార సంస్థలు ఫోను నుంచే సొంత పేరుమీద ప్రత్యేక వెబ్‌సైటు రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని డాట్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శైలాజ్‌ నాగ్‌ తెలిపారు. తమదగ్గరున్న సరకుల వివరాలు తెలియజేయడంతో పాటు, ఆర్డర్లు తీసుకోవడం, డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించడం లాంటి సేవలన్నీ ఈ వెబ్‌సైటు సాయంతో చేయొచ్చని పేర్కొన్నారు. వెబ్‌సైటు వివరాలను వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో తెలియజేయడం ద్వారా వినియోగదారులను ఆకర్షించేందుకు వీలవుతుందన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని